పూరి జగన్నాథ్ - విజయ్ దేవరకొండ సినిమా లైగర్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ సినిమాతో పూరికి వచ్చిన నష్టం ఎంత? బయ్యర్లు ఎంత పోగొట్టుకొన్నారు? అనే లెక్కలు ఇంకొన్ని రోజుల్లో తేలిపోతాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టీ... `జనగణమన`పై పడింది. లైగర్ పూర్తి అవ్వగానే.. పూరి కలల సినిమా `జనగణమన`ని ప్రకటించడం, అప్పటికప్పుడు ఓ షెడ్యూల్ పూర్తి చేయడం తెలిసిన విషయాలే. `లైగర్` హిట్టయితే.. `జనగణమన`పై ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలూ ఉండేవి కావు. అయితే లైగర్ డిజాస్టర్ అయిపోయింది. దాంతో జనగణమన ఉంటుందా, లేదా? అనే అనుమానాలు మొదలైపోయాయి.
లైగర్ ఫ్లాప్ తరవాత.. ఈ కాంబోపై ఎలాంటి అంచనాలు ఉండవు. పైగా జనగణమన.. లైగర్ కంటే పెద్ద బడ్జెట్ తో రూపొందిస్తామని పూరి చెప్పారు. ఇప్పుడు ఈ కాంబోపై అంత బడ్జెట్ ఏమాత్రం వర్కవుట్ అవ్వదు. పైగా అది కూడా పూరి సొంత సినిమానే. లైగర్ తో పూరి చాలా పోగొట్టుకొంటాడని, అలాంటప్పుడు జనగణమనకి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయన్నది మరో పెద్ద ప్రశ్న.కేవలం లైగర్‌కి ఈ హైప్ రావడానికే జనగణమన మొదలెట్టారని, ఆ ప్రాజెక్టు ఉండదని ఇంకొందరు వాదిస్తున్నారు. జనగణమన షూటింగ్ కేవలం 4 రోజులే జరిగిందట. కాబట్టి.. ఆపేసినా పెద్ద సమస్య ఏం ఉండదు.
పూరి రిస్క్ చేయడమో, లేదంటే... విజయ్ దేవరకొండ పట్టుబట్టి ఈ ప్రాజెక్టు మొదలెట్టించడమో జరిగితే తప్ప... జనగణమన ఉండనట్టే.