కృష్ణవంశీ ఫామ్ లో లేడు. ఆయన్నుంచి హిట్ సినిమా వచ్చి చాలా కాలమైంది. ఆ మాటకొస్తే కృష్ణవంశీ సినిమా థియేటర్లోకి వచ్చే.... చాలా ఏళ్లయ్యింది. మరాఠీ క్లాసిక్ `రంగమార్తండ`ని కృష్ణవంశీ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది. కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ సినిమాని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈలోగా.. రంగమార్తండ స్పెషల్ ప్రీమియర్ షో కూడా వేసేశారు. ఇండస్ట్రీలోని కొంతమంది దర్శకులకు, పాత్రికేయులకూ `రంగమార్తండ` షో వేశారు. ఈ షోకి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ సినిమా చూసినవాళ్లంతా ముక్త కంఠంతో `కృష్ణవంశీ నుంచి ఓ క్లాసిక్ రాబోతోంది` అని చెబుతున్నారు. అంతేకాదు.. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం పాత్రలు అద్భుతంగా కుదిరాయంటూ ప్రశంసిస్తున్నారు.
ముఖ్యంగా బ్రహ్మానందానికి ఇది కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుందని జోస్యం చెబుతున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయాలన్నది కృష్ణవంశీ ప్లాన్. ఇటీవల బలగం సినిమా వచ్చింది. ఆ సినిమాకి ముందు ఎలాంటి పబ్లిసిటీ లేదు.కానీ.. మౌత్ టాక్ వల్ల.. థియేటర్లు నిండాయి. బ్రేక్ ఈవెన్ కూడా అయ్యింది. ఇప్పుడు రంగమార్తండకు సైతం అదే మ్యాజిక్ జరుగుతుందన్నది అందరి నమ్మకం.