ఇస్మార్ట్ శంకర్ సినిమాకి గట్టి షాక్ తగిలింది. ఈసినిమా స్క్రిప్టు మొత్తం లీకైంది. దాన్ని మురళీ కృష్ణ అనే యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసేశాడు. దాంతో.. చిత్రబృందం అప్రమత్తమైంది. మురళీ కృష్ణపై దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మురళీ కృష్ణ తమని డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని, డబ్బులిస్తేనే సోషల్ మీడియాలో ఉన్న స్క్రిప్టుని డిలీట్ చేస్తానంటున్నాడని బెదిరిస్తున్నాడని పూరి, ఛార్మి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే మురళీకృష్ణ ముందగానే అప్రమత్తమై ఆ పోస్ట్‌ని డిలీట్ చేసేశాడు కూడా. `పూరి అడిగిన వెంటనే ఆ స్క్రిప్టు డిలీట్ చేశాను. ఇప్పుడు నాపై కేసు పెట్టడం ఏమిటి? నేను డబ్బులు కూడా డిమాండ్ చేయలేదు` అని మురళీ కృష్ణ వాదిస్తున్నాడు. పూరి సహాయకులే ఈ స్క్రిప్టుని లీక్ చేశారని, అది మురళీ కృష్ణ చేతికి చేరిందని వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి లీకు వీరుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే.