నాగబాబుని కేవలం నటుడిగానే చూడడం లేదు. ఆయన పొలిటికల్ లీడర్ కూడా. జనసేన కార్యకలాపాలకు దూరంగా ఉన్నా, నాగబాబుని ఆ పార్టీకి చెందిన నేతగానే పరిగణిస్తున్నారంతా. అందుకే నాగబాబు ఏం చేసినా అందులో పొలిటికల్ కోణాన్ని కూడా చూస్తున్నారు. ఏం తప్పు చేసినా, మిగిలిన పార్టీలు రాద్ధాంతం చేయడానికి రెడీ అవుతున్నాయి. తాజాగా నాగబాబుని టార్గెట్ చేశారు వైకాపా పార్టీ. నాగబాబు న్యాయనిర్ణేతగా జీ తెలుగులో `బొమ్మ అదిరింది` అనే కామెడీ షో ప్రదర్శితమవుతుంది.
ఈ షో ఇప్పుడు జగన్ ఫ్యాన్స్కి కోపం తెప్పించింది. ఈ ఆదివారం ఈ షోలో ఓ కామెడీ స్కిట్ ప్రదర్శించారు. అందులో జగన్ మేనరిజాన్ని ఓ నటుడు ఇమిటేట్ చేశాడు. అది జగన్ అభిమానులకు నచ్చలేదు. దాంతో జీ 5ని బ్యాన్ చేయాలని, ఆ ఛానల్ కేబుల్ టీవీలో రాకుండా చూడాలని జగన్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ షోలో పాల్గొన్న నటీనటులు, న్యాయ నిర్ణేతలూ అంతా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కొంతమంది అయితే ఓ అడుగు ముందుకేసి రోడ్డు ప్రమాదంలో నాగబాబు చనిపోయారు.. రిప్ అంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు కూడా పెడుతున్నారు. ఇప్పటికే ఈ షోలో పాల్గొన్న నటులు సోషల్ మీడియా ద్వారా `సారీ` చెప్పేశారు. నాగబాబు కూడా సారీ చెబుతాడా? లేదంటే లైట్ తీసుకుంటాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.