చిన్న సినిమాలకు ప్రస్తుతం క్రేజ్ బాగానే ఉంది. కొత్త కాన్సెప్ట్, తక్కుత లిమిట్ బడ్జెట్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నాయి చిన్న సినిమాలు. ఇదివరకటి రోజుల్లో చిన్న సినిమాలను పెద్దగా పట్టించుకునే వారే కాదు. కనీసం చిన్న సినిమాలను రిలీజ్ చేసేందుకు తగినన్ని థియేటర్స్ కూడా ఉండేవి కావు.
కానీ పరిస్థితి మారింది. ఇప్పుడు పాపులర్ దర్శక, నిర్మాతలు చిన్న సినిమాలకు అండగా నిలుస్తున్నారు. సురేష్‌బాబు వంటి ప్రొడ్యూసర్స్, సుకుమార్, మారుతి తదితర డైరెక్టర్స్‌తో పాటు నాగార్జున వంటి పాపులర్ స్టార్స్ కూడా చిన్న సినిమాలకు అండగా నిలుస్తున్నారు. దాంతో చిన్న సినిమాలకు పాపులారిటీ పెరుగుతోంది. తద్వారా మొత్తం సినీ ఇండస్ట్రీనే కళకళలాడుతోంది. తాజాగా 'రచయిత' అనే చిన్న సినిమా కోసం హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన జగపతిబాబు ముందుకు వచ్చారు.
ఈ సినిమాని తాను దత్తత తీసుకున్నానని జగపతిబాబు చెప్పారు. ఈ సినిమా కథ జగ్గూ భాయ్‌కి బాగా నచ్చిందట. దాంతో సినిమాలో నటించకపోయినా, స్టోరీ బాగా నచ్చి ఈ సినిమాని దత్తత తీసుకున్నాననీ జగపతిబాబు చెబుతున్నారు. ఓ మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆ సినిమా దర్శక, నిర్మాతలు చేస్తున్న ప్రయత్నం నచ్చి, ఈ సినిమాకి ఆండగా నిలవాలని నిర్ణయించుకున్నారట.
చిన్న సినిమాలు బాగా ఆడాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే ఈ సినిమాని ప్రమోట్ చేయాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నారట జగపతిబాబు. వైజాగ్, విజయవాడ, హైద్రాబాద్‌లో 'రచయిత' ప్రమోషన్‌కి తన వంతు కృషిని అందిస్తాననీ అన్నారు. 30 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న ఆయన తన వంతుగా సినీ పరిశ్రమకి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ పని చేస్తున్నాననీ అన్నారు జగపతిబాబు.