బాలారిష్టాలు వీడి 'సింగం-3' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే తమిళనాడులో జల్లికట్టు కోసం ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో హీరో సూర్య ఆందోళన చెందుతున్నాడట. నేడు చెన్నయ్‌లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. జల్లికట్టుకు సూర్య మద్దతునిచ్చినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయడం అంత క్షేమకరం కాకపోవచ్చు. కానీ డేట్ ఫిక్స్ చేసుకున్న తరువాత ఇంకోసారి వెనక్కి తగ్గడం కష్టమే. అసలే ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలతో ఈ సినిమా వెనక్కి వెనక్కి వెళుతూ వస్తోంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమాకి ఇప్పటికి టైం కుదిరిందనుకుంటే జల్లికట్టు రూపంలో మరో టెన్షన్ పట్టుకుంది. ఏది ఏమైనా ఈ సారి మాత్రం వెనక్కి తగ్గే అవకాశం లేదనిపిస్తోంది 'సింగం 3'. ఎలాగైనా గర్జించడం పక్కా అంటోంది. సూర్య సరసన అనుష్క, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించారు ఈ చిత్రంలో. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. గతంలో వచ్చిన సింగం, సింగం1 చిత్రాలు మంచి విజయాల్ని అందుకున్నాయి. ఈ సినిమా పైన కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్‌ని బట్టి చూస్తే ఈ సినిమా కూడా అంతటి విజయాన్ని అందుకొనే లక్షణాలు ఈ సినిమాకి ఉన్నాయనిపిస్తోంది. కానీ ఈ సినిమా విడుదల అనేసరికి ఏవో అవాంతరాలు వెతుక్కుంటూ వచ్చేస్తున్నాయి. 'ఎస్-3' పేరుని 'సి-3'గా మార్చినప్పటికీ సినిమాకి కష్టాలు తొలిగేలా కనిపించడంలేదు.