పవన్ కల్యాణ్ సినిమా వస్తోందంటే బాక్సాఫీసు దగ్గర ఆ ఊపూ.. ఉత్సాహం ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే.. పవన్ పాత సినిమాలకూ అంతే క్రేజ్ దక్కడం పవన్ స్టామినాకు నిదర్శనం. సెప్టెంబరు 2 పవన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా `జల్సా`ని 4K ప్రింటుతో రిలీజ్ చేస్తున్నారు. కేవలం హైదరాబాద్‌లోనే దాదాపు 80 స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. అన్ని థియేటర్లలోనూ టికెట్లన్నీ అప్పుడే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
ఇప్పుడు కొత్తగా స్క్రీన్‌లను పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కేవలం హైదరాబాద్ లెక్క మాత్రమే. తెలుగు రాష్ట్రాలలో దాదాపు 200 స్క్రీన్‌లను జల్సాని ప్రదర్శించాలని చూస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. ఆ టికెట్లు కూడా ఇదే స్థాయిలో అమ్ముడుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. పోకిరి సినిమాని దాదాపుగా 300 స్క్రీన్‌లలో ప్రదర్శించారు. ఆ రికార్డు బ్రేక్ చేయాలన్నది పవన్ ఫ్యాన్స్ ఆలోచన.
మొత్తంగా చూస్తే కనీసం 400 స్క్రీన్‌లలో జల్సా ప్రదర్శించడం ఖాయం. ఈ షోల ద్వారా కనీసం 3 కోట్ల ఆదాయం వస్తుందని సమాచారం. ఆ డబ్బుని ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించాలని చూస్తున్నారు. బుధవారం నాటికి షోలెన్ని, ఎంత ఆదాయం సమకూరుతుంది? అనే విషయాలపై ఓ స్పష్టత వస్తుంది.