అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తై జాన్వీకపూర్ ఇటీవలే 'ధడక్' సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. తొలి సినిమా అయినా నటిగా మంచి మార్కులే వేయించుకుంటోంది. కానీ అలనాటి అందాల తార అతిలోక సుందరి కూతురు కావడంతో, జాన్వీని ప్రతీ ఫ్రేములోనూ తల్లితో పోల్చి చూడడం సహజమే.
అయితే తాను శ్రీదేవి కూతురునే కానీ, కూతురుగా ఆమెను ఎప్పుడూ ఇమిటేట్ చేయాలనుకోవడం లేదనీ, హీరోయిన్ కావాలనుకున్న తనకు అమ్మ సూచించిన సలహా అదేననీ జాన్వీ చెప్పుకొచ్చింది. అందుకే స్క్రీన్‌పై ఏ యాంగిల్‌లోనూ, శ్రీదేవి కనిపించకుండా, జాన్వీ మాత్రమే కనిపించేలా తనదైన నటన కనబరిచాననీ జాన్వీ చెబుతోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ధడక్' చిత్రం మిశ్రమ టాక్ అందుకున్నా, వసూళ్ల పరంగా జోరుగా దూసుకెళ్తోంది.
శ్రీదేవి కూతురు నటించిన తొలి చిత్రం కావడంతో, బాలీవుడ్‌లోనే కాక, దక్షిణాదిన కూడా ఈ సినిమా వీక్షించిన వారున్నారు. అందుకే కలెక్షన్స్ విషయంలో ధడక్ బాగానే జోరు చూపిస్తోంది. ఇకపోతే శ్రీదేవి హిందీలో కన్నా, తెలుగులో ఎక్కువ సినిమాల్లో నటించింది. తెలుగులోనే ఆమెను దేవతగా ఆరాధించారు. అందుకు ఆమె వారసత్వం తెలుగులో కూడా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే శ్రీదేవి జీవించి ఉంటే ఈ పని కొంచెం సులువయ్యేది. కానీ ఆమె జీవించి లేకపోవడంతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీపై నీలినీడలు అలుముకున్నాయి.
అయితే 'ధడక్' విడుదలైన తర్వాత జాన్వీ తండ్రి, ప్రముఖ నిర్మాత అయిన బోనీకపూర్ టాలీవుడ్‌లో కూడా జాన్వీ ఎంట్రీ ఇచ్చేందుకు సుముఖత చూపిస్తున్నారనీ తెలుస్తోంది. ఆల్రెడీ టాలీవుడ్ నుండి జాన్వీకి ఆఫర్లు పోటెత్తుతున్నాయి. అయితే జాన్వీ సెకండ్ మూవీ మాత్రం బోనీకపూర్ నిర్మాణంలోనే ఉంటుందట.