జాన్వీ కపూర్.. చేసిన సినిమాలు, అందులో హిట్లూ తక్కువే కానీ, పాపులారిటీలో మాత్రం ఎవ్వరినీ తీసిపోదు. యూత్‌లో జాన్వీకి మంచి ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ మీడియా కూడా జాన్వీపై గట్టిగానే ఫోకస్ పెడుతుంటుంది. జాన్వీ ప్రేమలో ఉందని, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు షికార్ పహారియాతో డేటింగ్ చేస్తోందని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. దానికీ కారణాలున్నాయి. జాన్వీ - షికార్‌లు ఎక్కడ పడితే అక్కడ జంటగా దర్శనమిస్తున్నారు. ఒకరి ఇంట్లో శుభకార్యం జరిగితే, మరొకరు హాజరైపోతున్నారు. దాంతో ఈ రూమర్లకు బలం చేకూరినట్టైంది. తాజాగా `కాఫీ విత్ కరణ్`లో తన బోయ్ ఫ్రెండ్ గురించి నోరు జారింది జాన్వీ.
బాలీవుడ్ టీవీ షోలలో 'కాఫీ విత్ కరణ్'కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీజన్ నీ కరణ్ జోహార్ తనదైన శైలిలో రక్తి కట్టిస్తున్నాడు. ఈసారి షోకు జాన్వీ, ఖుషీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాన్వీ డేటింగ్ ముచ్చట్ల గురించి కూపీ లాగాడు కరణ్. ముందు నర్మగర్భంగా మాట్లాడిన జాన్వీ... ఓ సందర్భంలో మాత్రం నోరు జారింది.
‘‘మీ స్పీడ్ డైల్ లిస్ట్‌లో ఉండే ముగ్గురి పేర్లు చెప్పండి’’ అని కరణ్ అడగగానే.. ‘‘పాపా, ఖుషు, షీకు’’ అని చెప్పేసింది జాన్వీ. షీకు అంటే షికార్ పహారియా అన్నమాట. దాంతో.. జాన్వీ ప్రేమాయణం నిజమే అని రూఢీ అయిపోయినట్టైంది. తెలుగులో 'దేవర'తో జాన్వీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో జాన్వీ తెలుగు సినిమాలకు, కమర్షియల్ కథలకు పనికొస్తుందా, రాదా? తన ఫేమ్ టాలీవుడ్ లో ఎంత? అనేది తేలిపోతుంది.