2021 గడిచిపోయింది. ఈ యేడాది పరిశ్రమ అనేక ఒడిదుడుకుల మధ్య సాగినా - కొన్ని విజయాలు ఊరటనిచ్చాయి. ముఖ్యంగా ఒకట్రెండు చిన్న సినిమాలు అద్భుతమైన విజయాలతో.. పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. వాటిలో.. జాతిరత్నాలు ఒకటి. స్వరూప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ అశ్విన్ నిర్మించారు. వైజయంతీ మూవీస్ సంస్థ నుంచి వచ్చిన ఈ చిత్రం అనూహ్యమైన లాభాల్ని దక్కించుకుంది. కేవలం 4 కోట్లతో రూపొందిన ఈ చిత్రానికి ఏకంగా 40 కోట్ల రెవిన్యూ లభించింది. ఓరకంగా 2021లో అత్యధిక లాభాలు సంపాదించిన చిత్రంగా జాతిరత్నాలు చెప్పుకోవచ్చు.
నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం. ఈ యేటి మేటి కామెడీ చిత్రంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. సినిమాలో కథేం లేదు. కేవలం సన్నివేశాలే ఈ సినిమాని నడిపించాయి. జోగిపేట నుంచి వచ్చిన ముగ్గురు మిత్రులు.. హైదరాబాద్ లో ఏం చేశారు? వాళ్ల జీవితాలు ఎలా మలుపుతిరిగాయి? అనేదే కథ. నవీన్ నటన, ముఖ్యంగా కోర్టులో తాను పలికిన డైలాగులు, జైలు సన్నివేశాలు ఇవన్నీ ప్రేక్షకుల్ని బాగా నవ్వించాయి. చివర్లో వచ్చే ట్విస్టు కూడా... ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. జాతిరత్నాలు సీక్వెల్ కూడా రాబోతోందని ఓ టాక్ వినిపిస్తోంది. చూద్దాం.. 2022లో అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందేమో.??