2021లో ఎన్నో సూపర్ హిట్ పాటలొచ్చాయి. కొన్ని పాటలు చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. అయితే ఈ పాటల్లో సింహ భాగం సిద్ద్ శ్రీరామ్ నుంచి వచ్చినవే. చిత్రసీమకు లక్కీయెస్ట్ సింగర్ గా మారిపోయాడు సిద్ద్. తను పాట పాడితే.. అది సూపర్ హిట్టే అనే నమ్మకం వచ్చింది అందరికీ. అందుకే ప్రతీ సినిమాలోనూ సిద్ద్ తో ఒక్క పాటైనా పాడించుకోవాలని దర్శక నిర్మాతలు తాపత్రయ పడిపోతున్నారు. సినిమా చిన్నదో పెద్దదో.. సిద్ పాడిన పాట తప్పకుండా ఉండడం కామన్ అయిపోయింది. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకుంటున్న గాయకుడిగా సిద్ అవతరించాడు. అలా 2021 సింగర్ ఆఫ్ ది ఇయర్ అయిపోయాడు సిద్. తను ఈ యేడాది తెలుగులోనే దాదాపుగా డజను పాటలు పాడాడు. అంటే ప్రతీ నెలలోనూ... సిద్ నుంచి ఓ పాట వచ్చిందన్నమాట.
అర్ధ శతాబ్దం లో `ఏ కన్నులూ చూడనీ చిత్రమే` సూపర్ హిట్ గీతంగా నిలిచింది. ఆసినిమా ఫ్లాప్ అయినా ఈ పాట మాత్రం ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. `రంగ్ దే`లో - `నా కనులు ఎపుడూ కననే కనని` కూడా సిద్ ఆలపించిందే. `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` సినిమా అయితే... `నీలీ నీలీ ఆకాశం` పాటతోనే పాపులర్ అయ్యింది. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`లో - `మనసా.. మనసా..`, వకీల్ సాబ్ లో - `మగువా మగువా` పాడింది సిద్ నే. ఒకే ఒక లోకం నువ్వే (శశి), సో..సోగా (మంచి రోజులు వచ్చాయి) సిద్ నుంచి వచ్చిన మంచి పాటల్లో కొన్ని. ఇక పుష్ప లో `చూపే బంగారమాయెలే... శ్రీవల్లీ` పాట మార్మోగిమోగిపోయింది. సిద్ గొంతులో మోనాటినీ ఇంకా రాలేదు కాబట్టి.. తన హవా ఇంకొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. 2022లో సిద్ నుంచి మరిన్ని మంచి గీతాలు రావాలని ఆశిద్దాం.