ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు విలన్‌గా మారింది. సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించిన వ్యక్తి హీరో అయ్యాడు. ఇది రియల్ లైఫ్ పొలిటికల్ కథ. హీరోయిన్ జయాబచ్చన్‌ని ‘షేమ్ లెస్’ అంటూ కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ కొందరు ఎవరో కాదు, రవికిషన్ అభిమానులు. ఈ రవికిషన్ ఎవరో తెలుసు కదా.? ప్రస్తుతం లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈయన, తెలుగులో ‘రేసుగుర్రం’ తదితర సినిమాల్లో కరడుగట్టిన విలన్‌గా కనిపించాడు. బాలీవుడ్‌లో డ్రగ్స్ రగడపై రవికిషన్, జయాబచ్చన్ మధ్య పార్లమెంటు వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది.
బాలీవుడ్ డ్రగ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని రవికిషన్ ఆరోపిస్తే, కొందరు డ్రగ్స్ తీసుకుంటే.. మొత్తంగా సినీ పరిశ్రమకు దాన్ని ఆపాదిస్తారా.? అని జయాబచ్చన్ ఎదురుదాడికి దిగారు. ఇక్కడ, రవికిషన్ మాటల్లోనూ వాస్తవం వుంది. జయాబచ్చన్ మాటల్లోనూ వాస్తవం వుంది. డ్రగ్స్ కేవలం సినీ రంగానికే పరిమితం కాదు. రాజకీయాల్లోనూ చాలామంది డ్రగ్స్ బానిసలున్నారు.. డ్రగ్స్ స్మగ్లర్లు కూడా వున్నారన్న విమర్శలు లేకపోలేదు. విద్యార్థి లోకం కూడా డ్రగ్స్ చుట్టూ తిరుగుతున్న సందర్భాల్ని చూస్తున్నాం.
డ్రగ్స్‌ని జయాబచ్చన్ సమర్థించలేదు. బాలీవుడ్‌ని ప్రక్షాళన చేయాలని మాత్రమే రవికిషన్ అన్నారు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం రవికిషన్‌కి మద్దతుగా జయాబచ్చన్‌కి వ్యతిరేకంగా యుద్ధం జరుగుతోంది. ఈ ‘రింగు’లోకి అమితాబ్‌బచ్చన్, ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్‌లతోపాటు దురదృష్టవశాత్తూ చిన్నారి ఆరాధ్యను కూడా లాగుతున్నారు కొందరు అవివేకులు.