కరోనా కారణంతో 2020 బాక్సాఫీసు పూర్తిగా డీలా పడిపోయిది. అక్టోబరులోనో, నవంబరులోనో థియేటర్లు తెరచుకున్నా - సినిమాలు వచ్చే అవకాశం లేదు. పెద్ద సినిమాల్ని విడుదల చేయడానికి నిర్మాతలు జంకుతున్నాయి. చిన్నా, ఓ మాదిరి సినిమాలు డైరెక్టుగా ఓటీటీలో విడుదల అవుతున్నాయి. 2020 ఇక మర్చిపోవాల్సిందే అని.. వీలుంటే తమ సినిమాని సంక్రాంతికి విడుదల చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. దాంతో 2021 సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర చాలా సినిమాలు ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నాయి.
పవన్ కల్యాణ్‌నటిస్తున్న `వకీల్ సాబ్`ని సంక్రాంతికే విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు ఫిక్సయ్యారు. ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్లు భారీగా వస్తున్నా దిల్ రాజు కరగడం లేదు. ఈ సినిమాని కచ్చితంగా సంక్రాంతి బరిలోనే దింపుతామని ఆయన చెప్పకనే చెబుతున్నారు. అక్కినేని సోదరుల సినిమాలు సైతం.. సంక్రాంతికే రాబోతున్నాయని సమాచారం. నాగచైతన్య - శేఖర్ కమ్ముల `లవ్ స్టోరీ` జనవరి 8న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నార్ట. మరోవైపు `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` కూడా సంక్రాంతికే రావడానికి చూస్తోంది. రవితేజ `క్రాక్` సైతం సంక్రాంతి పుంజుగా మారబోతోంది. ఈసినిమాని మంచి ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ.. రవితేజ మాత్రం ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేద్దామంటున్నాడట. వాళ్ల ఫోకస్ కూడా పొంగల్ పైనే. వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది.
ఈ సినిమాని ఈ యేడాదే విడుదల చేయాలనుకున్నారు నిర్మాతలు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. జనాలు థియేటర్లకు వస్తారో, రారో తెలియనప్పుడు ఈ సినిమాని ఇప్పట్లో విడుదల చేయడం రిస్కే అని మైత్రీ మూవీస్ భావిస్తోంది. ఈసినిమా కూడా సంక్రాంతికి షిఫ్ట్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి ఈ సారి సంక్రాంతికి సినిమాల హడావుడి బాగానే ఉన్నా, స్టార్ల సినిమాలు చూసే అవకాశం చాలా తక్కువ. బడా స్టార్ సినిమా అంటే వకీల్ సాబ్ మాత్రమే అనుకోవాలి. ఆ సినిమాకి.. మిగిలిన హీరోలు ఎంత వరకూ పోటీ ఇస్తారో చూడాలి.