తారాగణం: గంటా రవి, మాళవికా రాజ్, వెన్నెల కిషోర్, వినోద్ కుమార్
నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం: మణిశర్మ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
చాయాగ్రహణం: జవహర్ రెడ్డి
డైలాగ్స్: పరుచూరి బ్రదర్స్
నిర్మాత: కె అశోక్ కుమార్
దర్శకత్వం: జయంత్ సి పరాన్జీ
యావరేజ్ యూజర్ రేటింగ్: 2/5
తెలుగు తెరపై వారసుల హవా కొనసాగుతోంది. హీరోల తనయులు హీరోలైపోతున్నారు. మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించినా, నటనలో వాళ్లకు ఓనమాలు కూడా రాకున్నా.. మెల్లిమెల్లిగా వాళ్లకు అలవాటు పడడం ప్రారంభించారు ప్రేక్షకులు. క్రమంగా వాళ్లు కూడా స్టార్లయిపోయారు. ఇప్పుడు రాజకీయ రంగం నుంచి కూడా... వారసులు తెలుగు సీమలో దిగిపోతున్నారు. గంటా రవి అలా వచ్చినవాడే. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా పలుకుబడి ఉన్న.. గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవి. `జయదేవ్`గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంత్రిగారి తనయుడి నటన ఎలా ఉంది? సినిమాలకు పనికొస్తాడా?? ఈ సినిమా ఏ వర్గం ప్రేక్షకులకు నచ్చుతుంది? జయదేవ్ సినిమాకీ, జయదేవ్‌గా గంటా రవికి ఎన్ని మార్కులు పడతాయి? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ ఎలా ఉందంటే..?
జయదేవ్ (గంటా రవి) నిజాయతీగల పోలీస్ ఆఫీసర్. కోపం ఎక్కువ. అక్కా బావలతో కలసి ఉంటాడు. పక్క ఊరి పోలీస్ స్టేషన్‌లో నిజాయతీగా పనిచేస్తున్న ఎస్.ఐ శ్రీధర్ (రవి ప్రకాష్)ని దారుణ హత్యకు గురవుతాడు. ఆ కేస్ జయదేవ్ హ్యాండిల్ చేయాల్సివస్తుంది. ఈ హత్య వెనుక మస్తాన్ (వినోద్ కుమార్) హస్తం ఉందని తెలుస్తుంది. అందుకు సంబంధించిన సాక్ష్యాల్ని సేకరిస్తాడు జయదేవ్. అయితే ఆ సాక్ష్యాల్ని తారుమారు చేసి, జయదేవ్ సస్పెండ్ అయ్యేలా చేస్తాడు మస్తాన్. మళ్లీ జయదేవ్ డిపార్ట్‌మెంట్‌లోకి ఎలా అడుగుపెట్టాడు? మస్తాన్ అరాచకాలకు ఎలా అడ్డుకట్ట వేశాడు? శ్రీధర్ కుటుంబానికి ఎలా న్యాయం చేశాడు? అనేదే జయదేవ్ కథ.
* నటీనటుల ప్రతిభ ఎలా ఉందంటే..?
గంటా రవికి ఇదే తొలి సినిమా. డాన్సులు చేయలేకపోయాడు. చిన్న చిన్న స్టెప్పులు కూడా వేయలేకపోయాడు. నడక గంభీరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఏమో.. బిగుసుకుపోయాడు. ఎమోషన్ సీన్స్‌లో ఓకే అనిపించాడు. సీరియస్‌నెస్ ఉన్న పాత్రల్ని అప్పజెబితే రాణించగలడు.
కథానాయిక పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. అసలు ఆ క్యారెక్టర్ లేకపోయినా కథకు వచ్చే నష్టం లేదు. ఉన్నంతలో గ్లామర్‌గా చూపించడానికి ప్రయత్నించారు. వినోద్ కుమార్ కన్నా... గుర్తింపు ఉన్న నటుడి చేత ప్రతినాయకుడి పాత్ర వేయిస్తే బాగుండేది. వెన్నెల కిషోర్ కామెడీ ఈసారి అతకలేదు. బిత్తిరి సత్తి ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. మిగిలిన వాళ్లు సో.. సో!
* తెరపై ఎలా సాగిందంటే....?
తమిళంలో మంచి విజయం సాధించిన సేతుపతికి రీమేక్.. ఈ జయదేవ్. కథ, కథనాల్లో సేతుపతిలోనూ కొత్తదనం ఏముండదు. మామూలు పోలీస్ స్టోరీ అంతే. కానీ ఎమోషన్స్ మాత్రం అద్భుతంగా పండాయి. ఆ ఎమోషన్స్ జయదేవ్‌లో క్యారీ అవ్వకపోవడం ప్రధానలోపం. కథని తర్జుమా చేసినంత ఈజీ కాదు.. ఎమోషన్స్‌ని క్యారీ చేయడం. ఆ విషయంలో జయంత్ పూర్తిగా విఫలం అయ్యాడు. జయదేవ్ పాత్రని శక్తిమంతంగా చూపించడంలోనూ, ప్రతినాయకుడిగా మస్తాన్ పాత్రని భీకరంగా తయారు చేయడంలోనూ జయంత్ తేలిపోయాడు. దాంతో.. వారిద్దరి మధ్య క్లాష్ అంతగా కుదర్లేదు. ఫస్టాఫ్‌లో కథ పెద్దగా నడవలేదు. ద్వితీయార్థంలో మాత్రం కథ, కథనాలు బాగానే సాగినా... ప్రయోజనం కనిపించదు. జయదేవ్ సస్పెండ్ అయ్యాకే.. అసలు కథ మొదలవుతుంది. చిన్న పిల్లాడి చేత తుపాకీ కాల్పించే సీన్ బాగానే ఉన్నా.. తెలుగులో కంటే, తమిళంలోనే ఆసీన్ హైలెట్ అయ్యింది. ప్రధానమైన సన్నివేశాలన్నీ తూతూ మంత్రంగా తీసేశారనిపిస్తుంది. దాంతో.. కీలకమైన ఎపిసోడ్స్ లో ఇంపాక్ట్ తగ్గిపోయింది.
* సాంకేతికంగా చూస్తే..
మణిశర్మ సంగీతం తేతిపోయింది. పాటలు గుర్తుపెట్టుకొనేలా లేవు. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. కెమెరా వర్క్ బాగుంది. పరుచూరి వారి సంభాషణల్లో కొత్తదనం కనిపించలేదు. జయంత్ ఉన్న కథని సమర్థవంతంగా తెరకెక్కించలేకపోయాడు. నటుడిగానూ రవి ఫెయిల్ అయితే, ఆ తప్పు కూడా జయంత్‌దే.
* ప్లస్సులు
+ ద్వితీయార్థం
* మైనస్సులు
- మిగిలిన అన్నీ..
* ఫైనల్ వర్డిక్ట్:
జయదేవ్... ఎమోషన్ తగ్గింది
రివ్యూ బై శ్రీ