సీనియర్ నటి జయసుధ పేరు ఈమధ్య వార్తల్లో గట్టిగా వినిపిస్తోంది. జయసుధ భర్త నితిన్ కపూర్ 2017లో ఆత్మహత్య చేసుకొన్నారు. అప్పటి నుంచీ జయసుధ ఒంటరిగానే ఉంటున్నారు. ఇప్పుడు ఆమె రహస్యంగా పెళ్లి చేసుకొన్నారన్న ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఓ విదేశీ వ్యాపారవేత్తతో జయసుధ సన్నిహితంగా ఉంటున్నారు. ఈమధ్య ఏ కార్యక్రమంలో చూసినా..వారిద్దరే జంటగా దర్శనమిస్తున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకొన్నారని గుసగుసలు గట్టిగా వినిపించాయి. వీటిపై ఈ సీనియర్ నటి క్లారిటీ ఇచ్చారు.
తాను ఎవరినీ పెళ్లి చేసుకోలేదని, ఆ వ్యక్తి తన భర్త కాదని, తన బయోపిక్ తీయడానికి వచ్చిన దర్శకుడని క్లారిటీ ఇచ్చారు. తన రోజువారీ జీవిత దినచర్య తెలుసుకోవడానికీ, తనని దగ్గరుండి పరిశీలించడానికి విదేశాల నుంచి వచ్చారని, అంతే తప్ప.. ఇద్దరూ పెళ్లి చేసుకోలేదని వివరణ ఇచ్చుకొన్నారు జయసుధ. ఆమధ్య జయసుధ అనారోగ్యం పాలయ్యారు. చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన జయసుధ.. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకొన్నారు. ఆ సందర్భంలోనే ఆ దర్శకుడితో పరిచయమైందని తెలుస్తోంది. సో.. జయసుధ బయోపిక్ వస్తోందన్నమాట. మరి జయసుధ పాత్రలో ఎవరు కనిపిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.