మెగాస్టార్ చిరంజీవిని సినీ పరిశ్రమలో అభిమానించనివారెవరైనా వుంటారా.? పైగా, ఇటీవలి కాలంలో మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్నలా మారి, సేవా కార్యక్రమాల్లోనూ.. ఇతర్రతా సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యవహారాల్లోనూ అనుసరిస్తున్న వైఖరికి మునుపటికంటే ఎక్కువ అబిమానం ఆయనపై ఏర్పడుతోంది సినీ జనాలకి. అసలు విషయానికొస్తే, నటుడు జెడి చక్రవర్తి, మెగస్టార్ చిరంజీవికి ఓ లేఖ రాశారు. ‘నేను మీ అభిమానినే.. మీ అనుచరుడ్ని మాత్రం కాదు. మీరు కరోనా వైరస్ నేపథ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, సినీ పరిశ్రమకు పెద్దన్నగా నిర్వహిస్తున్న బాధ్యతలు నన్ను మీ అభిమానిగా మార్చేశాయి.
మీపై నాకున్న అభిమానం మరింతగా పెరిగింది. మిమ్మల్ని కలిసి అభినందించాలని వుంది. కానీ, ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. చాలామంది సినీ కార్మికులతో మాట్లాడినప్పుడు, సినిమా షూటింగులు ఆగిపోయినా.. కరోనా క్రైసిస్ ఛారిటీ కారణంగా తాము ఆనందంగా వున్నామని చెప్పారు. ఈ సందర్భంగా వారందరి తరఫున మీకు నా కృతజ్నతలు..’ అంటూ జెడి చక్రవర్తి, మెగాస్టార్ చిరంజీవికి రాసిన లేఖలో పేర్కన్నారు. ఈ లేఖ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. ఈ మధ్య సినిమాల్లో నటించడం తగ్గించినా, జెడి చక్రవర్తి తన ఆటిట్యూడ్ కారణంగా వార్తల్లో వుంటూనే వుంటారు. అదే ఆయన ప్రత్యేకత. ఒకప్పుడు విలక్షణ నటుడిగా ఓ స్థాయిలో వరుస విజయాలు దక్కించుకున్న జెడి, ఈ మధ్య విలన్ పాత్రల్లో అప్పుడప్పడూ కనిపిస్తున్న విషయం విదితమే.