సినీ పరిశ్రమ తల్లడిల్లుతోంది. తమను ఆదరించిన ప్రేక్షక లోకం థియేటర్లకు రాలేని పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సినిమా షూటింగుల్లేక.. సినిమా ప్రదర్శనలకు వీలుకాక.. తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, కరోనా కష్ట కాలంలో ప్రజల్ని ఆదుకునేందుకు మాత్రం సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. అయితే, ఇంకెన్నాళ్ళలు ఈ లాక్ డౌన్.? ఈ ప్రశ్న ఇప్పుడు సినీ పరిశ్రమలో మరింత అలజడిని రేకెత్తిస్తోంది. 50 రోజులు పూర్తయ్యింది లాక్ డౌన్ మొదలయి. షూటింగులు ఆగిపోవడం, సినిమా రిలీజులు ఆగిపోవడంతో సినీ పరిశ్రమ తీవ్ర నష్టాల్ని చవిచూస్తోంది. మరింత నష్టాల్ని భరించే పరిస్థితుల్లో తెలుగు సినీ పరిశ్రమ లేదంటూ పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు.
అయితే, ఇది విపత్తు గనుక.. చేయగలిగిందేమీ లేదనీ, ప్రభుత్వాలు తమను కూడా ఆదుకోవాలని వారు కోరుతున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే థియేటర్లు తెరుచుకోవడం కష్టమే. తెరుచుకున్నా, జనం థియేటర్లకు రావడానికి కొంత సమయం పడుతుంది. వచ్చినా, ఇదివరకటిలా థియేటర్లు ఫుల్ అయ్యే పరిస్థితులు వుండకపోవచ్చు. అంటే, సినీ పరిశ్రమ కోలుకోవడానికి చాలా సమయమే పట్టవచ్చు. ఈ నేపథ్యంలో, తమను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాలను కోరేందుకు ఇప్పటికే తమిళ, మలయాళ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ముందడుగు వేశారు. రేపో మాపో తెలుగు సినీ పరిశ్రమ కూడా అదే బాట నడవక తప్పదు. లాక్ డౌన్ ఎత్తివేశాక సినిమా టిక్కెట్ల ధరలు పెరుగుతాయనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, ప్రస్తుతానికైతే ఆ చర్చ సినీ పరిశ్రమలో జరగడంలేదట.