నటి, దర్శకుడురాలు జీవితకు ఓ బంపర్ ఆఫర్ తగిలింది. రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. జీవిత చాలాకాలంగా నటనకు దూరంగా ఉన్నారు. ఆమె కెమెరా ముందుకొచ్చి చాలా కాలమైంది. దర్శకురాలిగా సినిమాలు చేస్తున్నా అడపా దడపా మాత్రమే. రాజశేఖర్ చిత్రాలకు, అందులోనూ రీమేక్ కథలకు మాత్రమే ఆమె దర్శకత్వం వహిస్తున్నారు. కుమార్తెలు శివానీ, శివాత్మిక కెరీర్‌పై ప్రత్యేక దృష్టి నిలిపారు.
అయితే జీవితకు అనూహ్యంగా రజనీకాంత్ సినిమా నుంచి పిలుపొచ్చింది. రజనీకాంత్ కొత్త చిత్రం `లాల్ సలామ్`లో ఆమెకు ఓ కీలకమైన పాత్ర దక్కింది. ఈనెల 7 నుంచి జీవిత సెట్లో కాలు పెట్టబోతున్నారు. చెన్నైలో జరిగే ఓ కీలకమైన షెడ్యూల్‌లో ఆమె పాలు పంచుకోనున్నారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. జీవితకు చాలా కాలంగా సినిమాల్లో నటించే ఆఫర్లు వస్తున్నాయి.కానీ.. జీవిత రిజెక్ట్ చేస్తున్నారు. రజనీకాంత్ సినిమా కావడంతో.. ఆమె `నో` చెప్పలేకపోయారు. ఒక విధంగా జీవితకు ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలి.