లడ్డూబాబు గుర్తుందా? అల్లరి నరేష్ చేసిన సినిమా. సన్నగా రివటలా ఉండే నరేష్.. కొబ్బరి బొండాంలా మారిపోయిన సినిమా. రవిబాబు దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం పరాజయం పాలైంది. కాకపోతే... ఓ కొత్త నరేష్‌నిచూసే ఛాన్స్ దక్కింది. సేమ్ టూ సేమ్ అలాంటి ప్రయోగమే చేశాడు సుధీర్ బాబు. సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించే సుధీర్.. ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ గెటప్‌లోకి మారిపోయాడు. `మామా మశ్చింద్ర` సినిమా కోసం. హర్షవర్థర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో సుధీర్ బాబు దుర్గ, పరశురామ్... ఇలా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు.
దుర్గ గెటప్‌ని ఈరోజు రివీల్ చేశారు. ఇందులో... బొద్దుగా, లావుగా కనిపిస్తున్నాడు సుధీర్. ఇదంతా మేకప్ మహత్యమే. కాకపోతే... గెటప్ కొత్తగా ఉంది. సుధీర్ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు అనే హింట్ ఈ పోస్టర్‌తో కనిపించింది. రెండో గెటప్‌ని ఈనెల 7న రివీల్ చేయబోతున్నారు. ఇదో యాక్షన్ ఎంటర్‌టైనరని, కొత్త తరహా కథ, కథనాలతో సాగబోతోందని చిత్రబృందం చెప్పింది. ఇప్పటికైతే వివరాలు ఇవే. మరిన్ని అప్‌డేట్స్ కావాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.