ఈమధ్య టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. కలక్షన్లకూ, రివ్యూలకూ అస్సలు సంబంధమే ఉండడం లేదు. దానికి తాజా ఉదాహరణలు... జెర్సీ, మహర్షి.
నాని - గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన `జెర్సీ`కి విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈసినిమాని ఆహా.. ఓహో అంటూ పొగిడేశారంతా. రివ్యూల్లోనూ మంచి రేటింగులు కనిపించాయి. నాని సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించే సినిమా అవుతుందని ట్రేడ్ పండితులు కూడా ఊహించారు. కానీ ఆ లెక్కలన్నీ తప్పాయి. ఈసినిమా బాక్సాఫీసు దగ్గర బొటాబొటీ వసూళ్లతో గట్టెక్కింది. భారీ లాభాల మాట అటుంచితే.. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ చచ్చీ చెడీ సాధించింది. నిర్మాతలకు పెట్టుబడి మాత్రమే మిగిలింది.
మరోవైపు మహర్షికి.. రేటింగులు అంత గొప్పగా ఏం రాలేదు. సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై బాగా ట్రోలింగ్ జరిగింది. మరీ ముఖ్యంగా లెంగ్త్ విషయంలో బోలెడన్ని సెటైర్లు కనిపించాయి. కొంతమంది మహేష్ ఫ్యాన్స్ కూడా దీనిపై బాహాటంగానే స్పందించారు. అయితే వసూళ్లు మాత్రం భీకరంగా ఉన్నాయి. వీకెండ్ దాటేసినా.. ఎక్కడా మహర్షి జోరు తగ్గలేదు. టాప్ 5లో మహర్షి చోటు సంపాదించుకుంది. మహేష్ గత సినిమాల రికార్డులన్నీ అవలీలగా దాటేస్తోంది. దాన్ని బట్టి అసలు రివ్యూలకూ, వసూళ్లకూ అస్సలు పొంతన ఉండదని క్లియర్‌గా అర్థమైపోతోంది.