ఎన్టీఆర్ హీరోగా 'జై లవకుశ' సినిమా మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ జోరుగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తన మనసులోని మాటలను మీడియా ముఖంగా అభిమానులతో ఆప్యాయంగా పంచుకుంటున్నారు. సినిమా నిర్మాణం పూర్తయింది కదా. ఇప్పటికే మీరు ఈ సినిమాని చూసేశారా? అని ఎన్టీఆర్‌ని ప్రశ్నించగా, అలా చూసేస్తే కిక్కుండదన్నారు ఎన్టీఆర్. ఈ సినిమానే కాదు, తానింతవరకూ ఏ సినిమాని అలా చూడలేదన్నారు ఎన్టీఆర్. అంతేకాదు తమ ఇంటి మెంబర్స్ కూడా అలా చూడరనీ చెప్పారు ఎన్టీఆర్. సినిమా ధియేటర్‌లో విడుదలయ్యాకనే అభిమానులతో పాటు చూస్తారట. కానీ ముందుగా ఎప్పుడూ చూడలేదంట. అలాగే ఎన్టీఆర్ తల్లి, భార్య, కొడుకులతో కలిసి సినిమాని వీక్షిస్తారట. సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ తన తల్లిని సినిమా ఎలా ఉందని అడిగితే, సినిమా ఎక్కడ చూశానురా సినిమా అంతా నిన్ను చూడడమే సరిపోయింది. మళ్లీ ఇంకోసారి వెళదాం అంటారట. అలాగే ఆయన ప్రతీ సినిమా హిట్టే అంటారట ఆవిడ. ఇకపోతే సినిమా విడుదల దగ్గర పడింది కదా. మీ అభిప్రాయం ఏంటంటే దానికి కూడా ఎన్టీఆర్ భలే సమాధానమిచ్చారు. ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ టెన్షన్ లేకుండా కాన్ఫిడెంట్‌గా రాసేస్తాం. కానీ రిజల్ట్ వచ్చేటప్పుడే కదా అసలైన టెన్షన్. అలాగే సినిమా చేసినప్పుడు ఎలాంటి టెన్షన్ లేదు. కానీ విడుదల టైంలో టెన్షన్ ఉండడం సహజమే. విడుదలయ్యాక ఫస్ట్ షో, సెకండ్ షోకి టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్‌లా తాను కూడా ప్రతీ సినిమాకి విడుదలయ్యాక రిజల్ట్ కోసం టెన్షన్‌గా ఎదురు చూస్తూ ఉంటాననీ ఎన్టీఆర్ అన్నారు.