జూనియర్ ఎన్టీఆర్ కావొచ్చు, కళ్యాణ్‌రామ్ కావొచ్చు తెలంగాణలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం కోసం రాకపోవడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని, నందమూరి సినీ అభిమానుల్నీ ఆశ్చర్యపరిచింది. సోదరి సుహాసిని కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆమె కోసం అయినా కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొని వుండాల్సింది. చంద్రబాబు అడిగినా, బాలకృష్ణ చెప్పినా, ఆఖరికి సుహాసిని అభ్యర్థించినా ఈ ఇద్దరూ ప్రచారానికి రాలేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెరవెనుక ఏం జరిగిందో మాత్రం ఎవరికీ తెలియదు. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి, సినిమా కెరీర్‌ని నాశనం చేసుకోవడం మంచిది కాదంటూ బాలయ్య, చంద్రబాబే ఈ ఇద్దరికీ సలహా ఇచ్చారనీ, అందుకే ఆ ఇద్దరూ ప్రచారానికి రావాలనుకున్నా చివరి నిమిషంలో వెనక్కి తగ్గారని ఇంకో చర్చ జరుగుతోంది. అదలా వుంచితే, తాజాగా ఓ గాసిప్ సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మీద బాలకృష్ణ చాలా ఆగ్రహంతో వున్నారట.
ఎన్టీఆర్ రాకపోవడమే కాదు, కళ్యాణ్‌రామ్‌ని కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్ళనీయకుండా ఆపడమే ఇందుకు కారణమని ఆ గాసిప్స్ సారాంశం. ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా పనుల్లో బిజీగా వున్నాడు. కళ్యాణ్‌రామ్ కూడా తన కొత్త సినిమా '118' పనుల్ని చక్కబెడుతున్నాడు. సినిమాల్లో బిజీగా వుండడమే రీజన్ అయితే, బాలకృష్ణ ప్రతిష్టాత్మక చిత్రం 'ఎన్‌టిఆర్ బయోపిక్'ని పక్కన పెట్టి, తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ఎలా ప్రచారం చేసినట్లు?