ఇచ్చ‌ట అన్ని పాత్ర‌ల‌కూ న్యాయం చేయ‌బ‌డును.

By Gowthami - May 20, 2020 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్‌..

ఈ పేరులో ఓ ఫైర్ ఉంది.

ఓ జోరు ఉంది.

ఆ పేరుకి ఓ స్థాయి ఉంది.

అన్న నంద‌మూరి తార‌క రామారావు పేరే కాదు, ఆయ‌న రూప లావ‌ణ్యాల్ని పుణికి పుచ్చుకుని ఎదిగాడు ఎన్టీఆర్‌. ఆ ఇమేజ్‌నీ, ఆ స్టార్ డ‌మ్‌నీ మోస్తూ.. అభిమానుల్ని సంతృప్తి ప‌ర‌చుకుంటూ.. బుడ్డోడు కాస్త బుల్డోజ‌రులా దూసుకుపోతున్నాడు. తొలి సినిమా ఫ్లాపు. దాంతో పాటు ఎన్ని విమ‌ర్శ‌లో. ఎన్టీఆర్ రూప లావ‌ణ్యాల గురించి నెగిటీవ్ కామెంట్లు గుప్పుమ‌న్నాయి.

 

ఇక రెండో సినిమాతో దుమ్ము రేప‌డం మొద‌లెట్టారు. స్టూడెంట్ నెం.1, సింహాద్రి, ఆది ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఇర‌వై ఏళ్లు నిండా నిండ‌కుండానే, మూతి మూద మీసం పూర్తిగా మొల‌వ‌కుండానే స్టార్ అయిపోయాడు. అదే.. కాస్త ఇబ్బందీ పెట్టింది. త‌న ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగా ఎలాంటి క‌థ‌లు ఎంచుకోవాలో.. ఏ ద‌ర్శ‌కుడిపై త‌న బాధ్య‌త అప్ప‌గించాలో అర్థం కాక త‌ప్పులు చేశాడు. వ‌రుస ఫ్లాపులు. ఎన్టీఆర్ ఎంత త్వ‌ర‌గా ఎదిగాడో, అంతే త్వ‌ర‌గా డౌన్ ఫాలూ చూశాడు. ఇక ఎన్టీఆర్ పెంజుకోవ‌డం క‌ష్టం.. అని తేల్చేశారంతా. మిగిలిన హీరోలంతా హిట్లు మీద హిట్లు కొడుతుంటే.. తాను మాత్రం ఫ‌ట్టుమ‌నేవాడు.

 

అయితే... ఎగ‌సి ప‌డిన కెర‌టానికి మ‌ళ్లీ.. రివ్వున దూసుకురావ‌డం కూడా తెలుసు. అందుకే టెంప‌ర్ నుంచి త‌న రూటు మార్చాడు. త‌న‌లోని న‌టుడ్ని,స్టార్‌నీ పూర్తి స్థాయిలో వినియోగించుకునే క‌థ‌ల కోసం వెదికాడు. ఫ‌లితం ద‌క్కింది. టెంప‌ర్‌, జ‌న‌తా గ్యారేజ్‌, నాన్న‌కు ప్రేమ‌తో, జై ల‌వ‌కుశ‌, అర‌వింద స‌మేత‌.. ఇలా ఇది వ‌ర‌కెప్పుడూ లేనంత స్వింగులోకి వ‌చ్చేశాడు ఎన్టీఆర్‌. క్లాసు, మాసూ. ఫ‌న్నూ, సీరియ‌స్సు, పౌరాణికం.. ఇలా ఏ పాత్ర అయినా చేయ‌గ‌ల న‌టుడు క‌మ్ హీరో.. ఎన్టీఆర్ మాత్ర‌మే అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. జ‌న‌తా గ్యారేజ్ క్యాప్ష‌న్‌లా ఇచ్చ‌ట అన్ని పాత్ర‌ల‌కూ న్యాయం చేయ‌గ‌ల‌డు.. అని నిరూపించుకున్నాడు.

 

ఇప్పుడు రాజ‌మౌళి సినిమాలో కొమ‌రం భీమ్ లాసిద్ధం అవుతున్నాడు ఈ యంగ్ టైగ‌ర్‌. 2021లో ఈసినిమా చూడొచ్చు. ఇలోగా ఎంత‌మంది ఎన్టీఆర్ కోసం క‌థ‌లు సిద్ధం చేస్తున్నారో. అవ‌న్నీ అంద‌మైన కల‌లుగా వెండి తెర‌పై సాక్ష్యాత్క‌రిస్తాయో మ‌రి. అన్న‌ట్టు... ఈరోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ యంగ్ టైగ‌ర్ ఇలానే విజృంభిస్తూ పోవాల‌ని.. మ‌రెన్నో గొప్ప విజ‌యాలు అందుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటోంది ఐ క్లిక్ మూవీస్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS