రాజమౌళితో తమ హీరో సినిమా చేస్తున్నాడంటే.. అభిమానులంతా ఎగిరి గంతేస్తారు. ఆ సినిమా తప్పకుండా చరిత్రని సృష్టిస్తుందని వాళ్లకు ముందే అర్థమైపోతుంది. ఎందుకంటే రాజమౌళి ట్రాక్ రికార్డు అలాంటిది. సినిమా సినిమాకి ఎదిగిపోతున్నాడు. అందుకే తమ హీరోకీ ఆల్ టైమ్ రికార్డు ఇస్తాడని అభిమానుల నమ్మకం. అయితే... ఇంతలోనే మరో భయం పట్టుకుంటుంది.
తమ హీరోని రాజమౌళి ఎప్పుడు వదులుతాడా అని. ఎందుకంటే రాజమౌళి తన సినిమాని అమర శిల్పి జక్కన్న లా చెక్కుతూనే ఉంటాడు. పైగా ఏళ్లకు ఏళ్లు సెట్స్‌పైనే ఉండిపోవాల్సివస్తుంది. రిలీజ్ డేట్లు మారుతూ ఉంటాయి. ఈలోగా మరో సినిమా చేసుకోవడానికి వీల్లేదు. ప్రభాస్‌నే చూడండి. బాహుబలి కి రాజమౌళి దగ్గర ఎలా లాక్ అయిపోయాడో. ఐదేళ్ల పాటు కేవలం రెండే సినిమాలు వచ్చాయి. అదే అసలు భయం. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అంతే. రాజమౌళి దగ్గర లాక్ పడిపోయాడు.
వరుస హిట్లతో మంచి దూకుడు మీదున్న ఎన్టీఆర్‌నుంచి 2019లో ఒక్క సినిమా కూడా రాలేదు. ఇప్పుడు 2020లో కూడా రాదు. 2021 జనవరిలో తమ హీరోని తెరపై చూసుకుందామనుకుంటే.. సంక్రాంతికి ఆర్.ఆర్.ఆర్ రావడం లేదని తేలిపోయింది. మరి ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా తేలలేదు. 2021లో ఆర్.ఆర్.ఆర్‌రావడం ఖాయం. కానీ అదెప్పుడు? అని అడిగితే.. రాజమౌళి కూడా సమాధానం చెప్పలేడు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో మూడేళ్లకు ఓ సినిమా చేయడం అంటే.. పరిశ్రమకు తీరని లోటే. కాకపోతే ఒక్కటే ధైర్యం. రాజమౌళితో సినిమా అంటే.. పది కాలాల పాటు చెప్పుకునేలా ఉంటుంది. అందుకోసం ఎన్నాళ్లయినా ఆగొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అలా అనుకునే సంతృప్తి పడిపోవాలి.