'ఎన్టీఆర్' సినిమా కోలాహలంతో బుధవారం గడిచిపోయింది. హైదరాబాద్‌లో 'కథానాయకుడు' ప్రీమియర్ షోలూ, ఫ్యాన్స్ షోలూ ఏమీ లేకపోయినా... అంత హడావుడీ కనిపించింది. ఉదయం 7 గంటలకు కూకట్‌పల్లి భ్రమరాంబలో బాలకృష్ణ కోసం 'ఎన్టీఆర్ కథానాయకుడు' షోని ప్రత్యేకంగా వేశారు. దానికి విద్యాబాలన్, కళ్యాణ్ రామ్, క్రిష్ హాజరయ్యారు. మహేష్ బాబు మల్టీప్లెక్స్ లోనూ నందమూరి కుటుంబం కోసం ప్రత్యేకంగా ఓ షో వేశారు. దానికి... నందమూరి కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. మిస్ అయ్యింది ఒక్క ఎన్టీఆర్ మాత్రమే.
ఈమధ్య బాలయ్యకూ, ఎన్టీఆర్‌కీ మధ్య రాపో బాగానే ఉంది. అరవింద సమేత వీర రాఘవ ఫంక్షన్‌కి బాలయ్య హాజరయ్యాడు. ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్‌లో తారక్ కనిపించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ షోలలోనూ.. తను కనిపిస్తాడనుకున్నారు. కానీ.. ఎన్టీఆర్ రాలేదు. తనకి ఆహ్వానం అందలేదా? అందినా రాలేదా? అనే ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. ఈ సినిమాకి సంబంధించి తారక్ ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం ఇక్కడ గమనించ దగిన విషయం.
ఎన్టీఆర్ బయోపిక్ మిగిలిన సినిమాల్లా కాదు. తన తాతయ్య కథ. తన ఆరాధ్యదేవుడి పై బాబాయ్ తీసిన సినిమా. కనీసం ట్విట్టర్ ద్వారా అయినా శుభాకాంక్షలు తెలిపితే బాగుండేది. అది కూడా చేయలేదు. ఇవన్నీ నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. బాలయ్యతో ఎన్టీఆర్ కి ఇది వరకు ఉన్న దూరం తగ్గినట్టే తగ్గి... మళ్లీ మామూలైపోయిందా? అనే కొత్త ప్రశ్నలు మొదలవుతున్నాయి. దానికి సమాధానం ఎన్టీఆరే చెప్పాలి.