ఒకరా, ఇద్దరా?? దాదాపు డజను మంది కథానాయికలు 'ఎన్టీఆర్'లో మెరిశారు. విద్యాబాలన్ నుంచి పాయల్ రాజ్ పుట్ వరకూ వెండి తెరపై ఎంతోమంది కథానాయికలు. వాళ్లందరి గ్లామర్‌తో ఎన్టీఆర్‌కి సరికొత్త వెలుగులు వస్తాయని అభిమానులు భావించారు. సదరు కథానాయికలు కూడా 'ఈ సినిమాలో నటించడం మా అదృష్టం' అన్నట్టు మాట్లాడారు. అయితే... 'ఎన్టీఆర్' విడుదలైంది.
విద్యాబాలన్, నిత్యమీనన్ మినహా... మరో కథానాయిక వెండి తెరపై ఆనలేదు. ఏదో ఓ సన్నివేశంలో అలా మెరిసి... ఇలా మాయమైపోయారు. షాలినీ పాండే అయితే... ఎవరూ గుర్తు పట్టలేదు కూడా. కాస్తలో కాస్త ప్రణీత నయం. ఆమెకు కొన్ని డైలాగులు ఉన్నాయి. శ్రియ, హన్సిక, రకుల్.. వీళ్లెవరూ గుర్తింపుకు నోచుకోలేకపోయారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నది బాలయ్య ఉద్దేశం కావొచ్చు. అందుకే ఒక డైలాగ్ ఉన్న పాత్రలకు కూడా పేరున్న హీరోయిన్లకు తీసుకొచ్చారు.
అయితే వాటి వల్ల ఎన్టీఆర్‌కి వచ్చిన అదనపు ప్రయోజనం ఏమీ లేదు. ఆకుచాటు పిందె తడిసె, కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, ఛాంగురే బంగారు రాజా ఇలాంటి పాటలకు కూడా ఇరవై ముఫ్ఫై సెకన్లలో ముగిసిపోయేవే. మొత్తానికి ఏదో ఆశించి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు.. ఆయా పాత్రల్ని, వాళ్లకిచ్చిన ప్రాధాన్యాలను చూసి విస్తుపోతున్నారు.