టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కౌంటర్ ఇచ్చారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్‌ను ఉద్దేశిస్తూ తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
‘‘తెలుగు సినిమా, సాహిత్యం, దర్శకుడు, నటీనటులకు మొదటిసారి ప్రపంచవేదికలపై వస్తోన్న పేరు ప్రఖ్యాతలు చూసి గర్వపడాలి. అంతేకానీ, రూ.80 కోట్లు ఖర్చు అంటూ చెప్పడానికి మీ దగ్గర అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా? జేమ్స్ కామెరూన్, స్పీల్‌బర్గ్ వంటి పేరుపొందిన దర్శకులు డబ్బులు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని మీ ఉద్దేశమా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇటీవల తమ్మారెడ్డి భరద్వాజ ‘ఆర్‌ఆర్‌ఆర్ బడ్జెట్‌పై వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రాన్ని రూ.600 కోట్లు పెట్టి తెరకెక్కించారని, ఇప్పుడు ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యూనిట్ రూ.80 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఆస్కార్ ప్రమోషన్స్‌కి పెట్టిన ఖర్చుతో 8 సినిమాలు తీయొచ్చని కామెంట్స్ చేశారు. దీనిపై రాఘవేంద్రరావు కౌంటర్ ఇచ్చారు.