వంద సినిమాల ఖ్యాతి గాంచిన దర్శకుడు రాఘవేంద్రరావు. `నమో వేంకటేశ` తరవాత ఆయన మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు. `పెళ్లి సందడి 2` వస్తున్నా - దానికి రాఘవేంద్రరావు దర్శకుడు కాదు. ఆయన ఆ సినిమాలో నటిస్తున్నారు. దాంతో పాటు తనికెళ్ల భరణి దర్శకత్వంలో `ఓ బాబూ...` అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆ కథంతా రాఘవేంద్రరావు చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు దర్శకేంద్రుడికి మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
ఓ స్టార్ హీరో సినిమాలో రాఘవేంద్రరావు ఓ చిన్న పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం ఆ హీరోతో ఉన్న సాన్నిహిత్యం వల్లే.. ఈ పాత్ర ఒప్పుకున్నార్ట రాఘవేంద్రరావు. చూస్తుంటే.. దర్శకేంద్రుడి సెకండ్ ఇన్నింగ్స్ నటనకే పరిమితమైనట్టు కనిపిస్తోంది. అన్నట్టు పెళ్లి సందడిలో రాఘవేంద్రుడి పాత్రేమిటి అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. తను.. బాస్కెట్ బాల్ కోచ్ గా కనిపించనున్నార్ట. ఆయన కోసం ఓ పాట కూడా స్పెషల్ గా డిజైన్ చేశారు. ఇప్పటి వరకూ హీరోలు, హీరోయిన్ల చేత స్టెప్పులేయించిన రాఘవేంద్రుడు ఆ పాటలో స్టెప్పులేస్తారేమో చూడాలి.