అందాల చందమామ ఒక్కసారిగా అందర్నీ భయపెట్టేసింది కొత్త లుక్‌తో. ఈ కొత్త లుక్‌లో అస్సలేమాత్రం మేకప్ వేసుకోలేదు కాజల్ అగర్వాల్. చందమామకైనా మచ్చలుంటాయేమో, ఈ అందాల చందమామ కాజల్ మొహంలో ఒక్క మచ్చా వుండదని ఇప్పటిదాకా అంతా అనుకున్నారు. కానీ, అదంతా అబద్ధం. కాజల్ 'నిజస్వరూపం' చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. 'ఇదీ నా నిజమైన రూపం' అంటూ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో రెండు ఫొటోలు పెట్టింది. ఒకటి బ్లాక్ అండ్ వైట్, ఇంకోటి కలర్ ఫొటో. రెండిట్లోనూ కాజల్ భయపెట్టేసింది.
మొహమ్మీద లెక్కకు మిక్కిలిగా చిన్న చిన్న నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి. 'అబ్బే, కాజల్ ఫొటో కాదిది' అని చాలామంది అనుకున్నారు. కానీ, మేకప్ లేని తన ఫేస్ ఇలాగే వుంటుందని కాజల్ స్పష్టం చేసింది. అందం అంటే, మేకప్ వేసుకున్న తర్వాత కన్పించేది కాదనీ, బాహ్య సౌందర్యం కంటే, అంతఃసౌందర్యమే గొప్పదనీ చెబుతూ, ఈ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కాజల్ అగర్వాల్. అందంగా లేనివారిని చూసి అపహాస్యం చేయొద్దని కూడా చెప్పింది.
ఎలాంటి మేకప్ లేనప్పుడు ఎవరైతే ఆ మొహాన్ని అభిమానిస్తారో, వాళ్ళే నిజమైన అందం కలిగినవాళ్ళనీ పేర్కొంది కాజల్ అగర్వాల్. చెప్పిన మేటర్ హృదయాల్ని తాకుతున్నా, కాజల్‌ని అలా చూడటం మాత్రం అభిమానులకు నచ్చడంలేదు. 'అంటే, మేకప్ వేసుకుని, ఇన్నాళ్ళూ మమ్మల్ని మోసం చేశావా?' అని కొందరు సోషల్ మీడియాలోనే ఆమెను ప్రశ్నిస్తున్నారు. చాలామంది కాజల్ అభిమానులు మాత్రం, 'ఇప్పుడు మాకు ఇంకా బాగా నచ్చావ్.. ఇదీ నిజమైన అందం అంటే' అని ఆమెను అభినందిస్తున్నారు.