పెళ్లయ్యాక కథానాయికలకు సినిమా అవకాశాలు తగ్గుతాయి. కొంతమంది కావాలనే పరిశ్రమకు దూరం అవుతారు. అయితే కాజల్ మాత్రం పెళ్లయ్యాక మరింతగా విజృంభిస్తోంది. ఆచార్య, ఇండియన్ 2 చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇటీవల ఓ బాలీవుడ్ సినిమా ఒప్పుకుంది. తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తోంది. ఓ వెబ్ సిరీస్‌లో నటించింది. మరోటి సెట్స్‌పైకి వెళ్లడానికి రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో కాజల్ మరికొంత కాలం టాలీవుడ్లోనే ఉంటుందనుకున్నారంతా.
అయితే.. కాజల్ ఇప్పుడు తన కెరీర్‌పై షాకింగ్ కామెంట్లు చేసింది. సినిమాల్లో ఎంత కాలం ఉంటానో చెప్పలేనని, ఎప్పుడైనా సరే, గుడ్ బై చెప్పేసి వెళ్లిపోవచ్చని అంటోంది. ``మా ఆయన గౌతమ్ నన్ను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. పెళ్లయ్యాక సినిమాలు చేసే విషయంలో ఆయన ఇచ్చిన తోడ్పాటు చాలా గొప్పది. అయితే.. గౌతమ్ ఎప్పుడైనా సరే.. సినిమాలు మానేయ్ అని అడిగితే, తప్పకుండా మానేస్తా. గౌతమ్ తో పాటు... తన వ్యాపార వ్యవహారాల్లో పాలు పంచుకుంటా. ఈ విషయంలో గౌతమ్ మాటే నా మాట`` అని చెప్పుకొచ్చింది కాజల్. అంటే.. కాజల్ సినిమాల్లో ఉండాలా, వద్దా అన్నది పూర్తిగా గౌతమ్ నిర్ణయమన్నమాట.