పదేళ్ళుగా తెలుగు సినిమాల్లో నటిస్తున్నా, ఇంకా తెలుగులో డబ్బింగ్ చెప్పుకునే సాహసం చేయడం లేదు కాజల్ అగర్వాల్. తెలుగు మాట్లాడగలను, అర్థం చేసుకోగలను. డబ్బింగ్ చెప్పాలనుకోలేదెప్పుడు. దానికి కారణం చాలానే వున్నాయి. అయినా, డబ్బింగ్ అనేది పెద్ద సమస్యే కాదని అందాల చందమామ, 'డార్లింగ్' కాజల్ పలు సందర్భాల్లో చెప్పింది.
'ఎమ్మెల్యే' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న కాజల్, ఈ సినిమా ప్రమోషన్‌లో అందర్నీ మరింతగా ఎట్రాక్ట్ చేసేస్తోంది. కాజల్ ప్రత్యేకతే అది. ఏదన్నా సినిమా చేసిందంటే, ఆ సినిమా ప్రమోషన్ కోసం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. ఈ విషయంలో టాలీవుడ్‌లో హీరోయిన్లందరిలోకీ కాజల్‌ని వెరీ వెరీ స్పెషల్‌గా అభివర్ణిస్తుంటారు. పెద్ద సినిమా చేసినా, చిన్న సినిమా చేసినా కాజల్, సినిమా పబ్లిసిటీకి సంబంధించి ఒకేలా వ్యవహరిస్తుంటుంది. సినిమాని ప్రమోట్ చేయడం తన బాధ్యత అని చెప్పడం కాజల్‌కే చెల్లింది.
'ఎమ్మెల్యే' సినిమా విషయానికొస్తే, ఈ సినిమాని 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో పోల్చుతున్నారనీ, దానికీ దీనికీ చాలా తేడాలుంటాయనీ, 'ఎమ్మెల్యే' సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందనీ కాజల్ చెప్పింది. తన స్టయిలింగ్ గురించి చెబుతూ, ఎప్పటికప్పుడు ట్రెండ్‌ని ఫాలో అవుతుండడం వల్ల ఆ విషయంలో తనకు ఎప్పుడూ సమస్యలు ఎదురుకాలేదనీ, తనను స్టార్‌ని చేసిన తెలుగు ప్రేక్షకుల్ని ఎప్పటికీ మర్చిపోలనని కాజల్ వివరించింది. తన తొలి సినిమా హీరో (తెలుగులో) కళ్యాణ్‌రామ్‌తో చాలాకాలం గ్యాప్ తర్వాత నటిస్తుండడం చాలా ఆనందంగా వుందని కాజల్ చెబుతోంది. తేజ దర్శకత్వంలో కాజల్, 'లక్ష్మీకళ్యాణం' సినిమా ద్వారా తెలుగులో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ హీరోగా నటించాడు.