ఆచార్య విషయంలో కాజల్ కి జరిగిన అన్యాయం తెలిసిందే. ఈ సినిమాలో తాను నటించినప్పటికీ.. ఆ సన్నివేశాలన్నీ తొలగించారు. కథలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యం లేదని, ఆయా సన్నివేశాలన్నీ అతికించినట్టు ఉన్నాయని, అందుకే వాటిని తీయాల్సివచ్చిందని వివరణ కూడా ఇచ్చారు. దర్శకుడు ఎంత చెప్పుకొన్నా.. కాజల్ కి ఈ విషయంలో అన్యాయం జరిగినట్టే. ఓ పెద్ద సినిమాలోతాను నటించినప్పటికీ.. ఆయా సన్నివేశాల్ని తొలగించడం ఓ మచ్చగా మిగిలిపోతుంది.
అయితే.. ఇప్పుడు ఆ బాధ లేదు. ఎందుకంటే... శుక్రవారం విడుదలైన ఆచార్య డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. ఈ సినిమాలో కాజల్ లేదని బాధ పడినవాళ్లంతా.. `కాజల్ లేకపోవడమే మంచిదయ్యింది` అని కామెంట్లు చేస్తున్నారు. ఆ మాటకొస్తే... పూజా హెగ్డే పాత్రని తీసేసినా పెద్ద తేడా ఉండేది కాదని అభిప్రాయ పడుతున్నారు. తన సీన్లు డిలీట్ చేయడం వల్ల.. ఈ సినిమాలో సాంకేతికంగా కాజల్ లేనట్టే. అంటే... తన ఖాతాలోంచి ఓ డిజాస్టర్ తప్పినట్టైంది. నిజానికి.. ఈ సినిమా కోసం కాజల్‌ని ఎంచుకున్నప్పుడే ఆమె పారితోషికం సెటిల్ చేసేశారు. అంటే.. ఈ సినిమాతో తాను ఆర్థికంగా నష్టపోయిందేం లేదు. దాంతో పాటు కెరీర్‌లో ఓ భారీ డిజాస్టర్ నుంచి తప్పించకోగలిగింది. తంతే బూరెల బుట్టలో పడడం అంటే ఇదే.