హోలీ సందర్భంగా చందమామ కాజల్ అగర్వాల్ తన చెల్లెలు నిషా అగర్వాల్ కొడుకుతో దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోస్ చూసిన నెటిజన్లు కాజల్‌ని ప్రశ్నలతో తెగ విసిగించేశారు. తన కన్నా చిన్నదైన చెల్లెలికి పెళ్లి చేసేసింది కాజల్ అగర్వాల్. పెద్దమ్మ కూడా అయిపోయింది. కానీ, ఆమె పెళ్లి గురించి మాత్రం మాట్లాడడం లేదు. ఎప్పుడు పెళ్లి మాట ఎత్తినా దాటేస్తూ వచ్చేస్తోంది.
తాజాగా ఇంకోసారి కాజల్ ముందు పెళ్లి ప్రస్తావన సవాల్ విసిరింది. అయితే, ఈ సారి కూడా కాజల్ నుండి అదే సమాధానం వచ్చింది. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. కానీ, ఎప్పుడనేది ఇంకా చెప్పలేను అని సెలవిచ్చింది. ప్రస్తుతం కాజల్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉందని చెప్పాలి. షెడ్యూల్స్ అయితే బిజీగానే ఉన్నా, చెప్పుకోదగ్గ సినిమాలు కావవి. వాస్తవానికి కాజల్‌కి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘ఇండియన్ 2’ కంప్లీట్ అయితే ఆ లెక్క మరోలా ఉండేది. కానీ ఆ ప్రాజెక్ట్ ఇటీవల జరిగిన యాక్సిడెంట్ కారణంగా ప్రస్తుతానికి సస్పెన్స్‌లో పడిపోయింది.
ఇక తెలుగు విషయానికి వస్తే మంచు విష్ణు నిర్మాణంలో రూపొందుతోన్న ‘మోసగాళ్లు’ సినిమాలో కాజల్ నటిస్తోంది. అలాగే ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఇలా చిన్నా, చితకా ప్రాజెక్టులతోనే సరిపెట్టుకుంటోన్న కాజల్ ఇకనైనా పప్పన్నం పెట్టే పని మీద దృష్టి పెడుతుందేమో చూడాలిక.