ప్రస్తుతం ఎక్కడ చూసినా బుజ్జి టాక్ నడుస్తోంది. బుజ్జి గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎవరు ఈ బుజ్జి అనుకుంటున్నారా అదే నండీ కల్కి లో ప్రభాస్ నడిపే వాహనం. ఇంత వరకు కల్కి సినిమా కోసం వెయిట్ చేసింది ప్రభాస్ కోసం. కానీ ఇప్పుడు ప్రభాస్ నడిపే వాహనం బుజ్జి కూడా ఫేమస్ అయిపోయింది. బుజ్జి చేసే విన్యాసాలు చూడటం కోసం ఈ మూవీ పై మరింత ఆసక్తి నెలకొంది. బుజ్జి- ది సూపర్ రోబో కార్ సినిమాలో ప్రభాస్ కి రైట్ హ్యాండ్ అని టీజర్ ద్వారా తెలిపింది టీమ్. ఈ డిజైనర్ వాహనాన్ని ఆనంద్ మహీంద్రా కంపినీ తయారు చేసింది. ఇందుకోసం మేకర్స్ 7 కోట్లు ఖర్చు చేసారని తెలుస్తోంది. ఈ బుజ్జిని పరిచయం చేయటం కోసం స్పెషల్ ఈవెంట్ ని కూడా నిర్వహించారు మేకర్స్.
ఈ ఈవెంట్ తరవాత కల్కి పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇప్పటికే నాగ చైతన్య ఈ బుజ్జి ని డ్రైవ్ చేసి ''బుజ్జిని నడపడం ఎంతో అద్భుతంగా ఉందని, తానింకా షాక్‌లో ఉన్నట్లు, ఇంజినీరింగ్ కు సంబంధించిన రూల్స్ అన్ని కల్కి మూవీ టీమ్ బ్రేక్ చేసిందని కితాబిచ్చాడు. దర్శకుడి ఊహాశక్తిని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చిన టీమ్‌కు హ్యాట్సాఫ్ అని అన్నాడు చైతు. తరవాత భారతదేశపు మొట్టమొదటి ఫార్ములా 1 డ్రైవర్ నరైన్ కార్తికేయన్ కూడా బుజ్జిని డ్రైవ్ చేసి "ఫ్యూచరిస్టిక్ వాహనం, ఇది ఒక స్పేస్ షిప్ లాగా ఉందని" ప్రశంసించారు. ప్రస్తుతం బుజ్జీ చెన్నై రోడ్డు మీద చక్కర్లు కొడుతోంది. చెన్నై లో రోడ్డు పై వెళ్తున్న బుజ్జీ ని చూసి జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కల్కి జోరు పెంచేందుకు, బుజ్జిని మరింత ఫేమస్ చేయటానికి దర్శకుడు నాగ్ అశ్విన్ X అధినేత ఎలాన్ మస్క్ కి ఒక విజ్ఞప్తి చేసాడు. ఎక్స్ వేదికగా మస్క్ ని ఉద్దేశించి "ప్రియమైన ఎలన్ మస్క్ సర్.. మా బుజ్జీ ని చూడటానికి, డ్రైవ్ చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇది 6 టన్నుల బరువుతో పూర్తిగా ఇండియాలో తయారు చేయబడిన ఫుల్లీ ఎలక్ట్రిక్ కారు. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. మీరు బుజ్జీ ని ఒక సారి చూస్తే తప్పకుండా ఇష్టపడతారు" అని ట్వీట్ చేశాడు. ఇంకేముంది నిజంగా నాగ్ అశ్విన్ కోరిక మన్నించి మస్క్ బుజ్జిని డ్రైవ్ చేస్తే హాలీవుడ్ రేంజ్ లో కల్కి స్థాయి పెరగడం ఖాయం.