'కల్కి' కథా వివాదం

మరిన్ని వార్తలు

'కల్కి' కథా వివాదం పై 'కథా హక్కుల సంఘం' కన్వీనర్ బీవీఎస్ రవి స్పందన యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా 'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కల్కి'. శివాని, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా జూన్ 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. విడుదలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కార్తికేయ అలియాస్ ప్రసాద్ అనే రచయిత 'కల్కి' చిత్రకథ తనదేనని తెలుగు చలనచిత్ర రచయితల సంఘంలో ఫిర్యాదు చేశారు. మీడియా ముందుకు వచ్చారు. ఈ వివాదం గురించి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సభ్యుడు, కథా హక్కుల వేదిక కన్వీనర్ బీవీఎస్ రవి స్పందించారు.

 

'కథా హక్కుల వేదిక' కన్వీనర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ "తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సుమారు ఏడాదిన్నర క్రితం 'కథా హక్కుల వేదిక'కు రూపకల్పన చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే... రచయితల సంఘంలో సభ్యులు కాకుండా, కేవలం దర్శకుల సంఘంలో మాత్రమే సభ్యులైన వారి మధ్య సమస్యలను పరిష్కరించడం. 'కథా హక్కుల వేదిక' బృందంలో కొంతమంది ఉన్నారు. బయటకు రాని, బయటకు రానవసరం లేని ఎన్నో సమస్యలను ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా, ఇరు వర్గాలు సంతృప్తి చెందే విధంగా మేం పరిష్కరించాం. ఎన్నో సూపర్ హిట్ సినిమాల ట్రైలర్స్ చూసి తమ కథ అని వచ్చేవాళ్లు చాలామంది ఉంటారు. వాళ్ల కథను, సినిమా కథను మేం చదివి... రెండిటి మధ్య సంబంధం ఉందో లేదో చెబుతాం. కొన్ని కథలు మధ్య సారూప్యతలు కనిపిస్తుంటాయి.

 

ప్రముఖ హిందీ రచయిత జావేద్ అక్తర్ రూపొందించిన కాపీ రైట్ యాక్ట్ పద్దతిలో మేం సమస్యలను పరిష్కరిస్తున్నాం. దీనికి చట్టబద్ధత ఏమీ లేదు. సమస్యలను పరిష్కరించడమే మా ఉద్దేశం. ఒకవేళ మేం సూచించిన పరిష్కారం, మేం తీసుకున్న నిర్ణయం నచ్చకపోతే... కోర్టుకు వెళ్లొచ్చని కూడా మేం చెబుతాం. అలాగే, 'కల్కి'కి సంబంధించి కార్తికేయ అని ఒకరు కంప్లయింట్ చేశారు. మేం కార్తికేయ స్క్రిప్ట్, 'కల్కి' స్క్రిప్ట్ రెండూ చదివాం. ప్రాధమికంగా మాకు ఎటువంటి పోలిక కనిపించలేదు. సాధారణంగా ఈ విషయాన్ని మేం చెప్పకూడదు. కార్తికేయగారు మీడియా ముందుకు వచ్చారని తెలిసి చెబుతున్నా.

 

ఒకవేళ... 'కల్కి' విడుదలైన తరవాత మాకు ఇచ్చిన స్క్రిప్ట్ లో ఉన్నట్టు కాకుండా, కంప్లయింట్ ఇచ్చిన వ్యక్తి స్క్రిప్ట్ లో ఉన్నట్టు అనిపిస్తే డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాకు ఎటువంటి పోలిక కనిపించలేదు. సాధారణంగా కంప్లయింట్ చేసిన వ్యక్తి కథ అయితే అతనికి క్రెడిట్, రెమ్యునరేషన్ వచ్చేలా చూస్తున్నాం. అతడి క్రియేటివిటీకి తగిన న్యాయం జరిగేలా చూస్తున్నాం. ఒకవేళ కథల మధ్య పోలికలు లేకపోతే కంప్లయింట్ ఇచ్చిన వ్యక్తితో 'మీ కథకు సంబంధం లేదు' అని చెప్పి పంపిస్తున్నాం. ఇలా బయటకు వచ్చి మాట్లాడటం తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి నచ్చని అంశం. ఇలా బయటకు వచ్చి ఆరోపణలు చేస్తే ప్రస్తుతం మా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్. శంకర్, కార్యదర్శి రామ్ ప్రసాద్ గారితో చర్చించి... నిర్ణయం తీసుకుంటాం" అని అన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS