ఈ సంక్రాంతికి సినిమాల మధ్య గట్టి పోటీ ఉంది. అందుకే ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. అయితే ఈ సంక్రాంతికి వస్తున్న `సూపర్ మచ్చీ` మాత్రం ప్రమోషన్లలో వీక్ గా కనిపిస్తోంది. అసలు ఈ సినిమా ఈ సంక్రాంతికి వస్తుందా? రావడం లేదా? అనేది కూడా ఎవరికీ తెలియడం లేదంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ నటించిన సినిమా `సూపర్ మచ్చీ`. పులి వాసు ఈ చిత్రానికి దర్శకుడు. ఈనెల 14న వస్తోంది. అంటే కనీసం మూడు రోజుల గ్యాప్ కూడా లేదు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేయలేదు. మరోవైపు మిగిలిన సినిమాలన్నీ ప్రమోషన్లలో జోరు చూపిస్తుంటే, ఇది మాత్రం గప్ చుప్ గా ఉండిపోయింది. ఈ సినిమా ఎప్పుడొచ్చినా ఆడేస్తుంది అనే నమ్మకమో? లేదంటే.. అసలు ప్రమోషన్లకు రూపాయి ఖర్చు పెట్టినా అనవసరమే అనుకున్నారో ఏమో తెలీదు గానీ, సంక్రాంతి సినిమాల మధ్య సూపర్ మచ్చీ అనాథలా మిగిలిపోయింది.
కల్యాణ్ దేవ్ తొలి సినిమా `విజేత`. ఆసినిమా పెద్దగా ఆడలేదు గానీ, ప్రమోషన్లు మాత్రం బాగానే చేశారు. చిరంజీవి అల్లుడు సినిమా అనే కలరింగ్ ఇచ్చి, హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మెగా సపోర్ట్ అప్పట్లో ఆ సినిమాకి బాగానే ఉంది. ఇప్పుడు మాత్రం అంతా కలిసి గాలికి వదిలేశారు. అసలు కారణం ఏమిటో మరి..?!