రాక రాక కల్యాణ్ రామ్ కి ఓ హిట్టు వచ్చింది. బింబిసార రూపంలో. ఈ సినిమా తొలి రోజు వసూళ్లు బాగున్నాయి. అంత మాత్రాన బ్రేక్ ఈవెన్ అవుతుందని లేదు. దానికి పోటీగా `సీతారామం` ఉంది. అది ఫ్యామిలీ సినిమా. కాబట్టి... తొలి రోజు వసూళ్లని కాపాడుకోవాల్సిన అవసరం చిత్రబృందానికి ఉంది.
ఈలోగా కొంతమంది కల్యాణ్ రామ్ ఫ్యాన్స్ అతికి పోతున్నారు. తొలి రోజు వసూళ్లు చూసి, ఇక తమ హీరోకి తిరుగులేదనుకుంటున్నారు. సోషల్ మీడియాలో కొంతమంది కల్యాణ్ రామ్ ఫ్యాన్స్ చేస్తున్న అతి ఇందుకు నిదర్శనం. ఓ ఫ్యాన్ గ్రూపులో కల్యాణ్ రామ్ కి మెగాస్టార్ బిరుదు ఇచ్చేశారు. చిరంజీవి పని `ఆచార్య`తో అయిపోయిందని, ఆ పదానికి అర్హుడు కల్యాణ్ రామ్ అన్నది వాళ్ల ఉద్దేశ్యం. ఈ పోలిక మరీ హాస్యాస్పదం గా ఉంది. చిరు సాధించిన చరిత్ర ఒక్క సినిమాతో మాసిపోదు. ఒక్క సినిమాతో కల్యాణ్ రామ్ మెగాస్టార్ అయిపోడు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ గుర్తించాలి. ఇంకో ఫ్యాన్ పేజీలో కల్యాణ్ రామ్ కీ, ఎన్టీఆర్ కీ పుల్ల పెట్టాలని చూస్తున్నారు. బింబిసార, శక్తి పోస్టర్లని పక్క పక్కన పెట్టి, అసలు రక్తం కాబట్టే కల్యాణ్ రామ్ లో రాజసం ఉట్టిపడుతోందని, ఎన్టీఆర్ ది నకిలీ రక్తమని.. చీప్ కామెంట్లు చేశారు. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ బంధం.. ఎలాంటిదో అందరికీ తెలిసిందే. కల్యాణ్ రామ్ ఎన్టీఆర్‌ని `నాన్నా...` అని ప్రేమగా పిలుచుకుంటాడు.
అన్న కోసం.. ఎన్టీఆర్ ఏం చేయడానికైనా సిద్ధమే. అలాంటప్పుడు.. అన్నదమ్ముల అభిమానుల మధ్య పేచీ తీసుకురావడం ఎందుకు? ఎవరు అవునన్నా, కాదన్నా... కల్యాణ్ రామ్ సినిమాల్ని ఆదరిస్తున్నది.. ఎన్టీఆర్ ఫ్యాన్సే. వాళ్లనే దూరం చేసుకోవాలని చూడడం మరీ ఆత్మహత్యాసదృశ్యం. ఈ ఎగస్ట్రా వేషాల్ని కల్యాణ్ రామ్ ఫ్యాన్స్ అనుకునేవాళ్లు మార్చుకుంటే మంచిది. లేదంటే.. ఆ ఎఫెక్ట్ బింబిసార వసూళ్లపై పడే ప్రమాదం ఉంది.