ఈరోజుల్లో ఎంత చిన్న పాత్ర అయినా స్టార్లనే డిమాండ్ చేస్తోంది. పాన్ ఇండియా కల్చర్ వచ్చాక... ఈ పోకడ మరింత ఎక్కువైంది. ప్రతినాయకుడి పాత్ర వరకూ వచ్చేసరికి మరింత వైవిధ్యాన్ని ఆశిస్తున్నారు దర్శక నిర్మాతలు. స్టార్ హీరో సినిమాలో బలమైన ప్రతినాయకుడు లేకపోతే.. ప్రేక్షకులకూ రుచించడం లేదు. అందుకే.. ప్రతీ సినిమాకీ విలన్ ని పట్టుకోవడం ఓ పెద్ద సవాల్ గా మారిపోయింది. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. 2023లో ఈ కాంబో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోపే.. ప్రతినాయకుడి పాత్ర కోసం అన్వేషణ మొదలైపోయింది.
ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తారని ఓ ప్రచారం మొదలైంది. ప్రశాంత్ నీల్ ఈమధ్య కమల్ ని కలుసుకున్నాడు. అది ఎన్టీఆర్ సినిమా కోసమే అని టాక్. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబో అనగానే క్రేజ్ మొదలైపోయింది. ఇప్పుడు కమల్ కూడా తోడైతే ఈ సెగ మామూలుగా ఉండదు. మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా మొదలు కానుంది. ఆ సినిమాలోనూ కమల్ నే ప్రతినాయకుడిగా అనుకుంటున్నారని ప్రచారం మొదలైంది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకీ అదే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాల్లో కమల్ ఏది ఒప్పుకొన్నా.. ఆ ప్రాజెక్ట్ మామూలుగా ఉండదు.