కమల్ హాసన్ - వెంకటేష్ ఇద్దరూ మంచి మిత్రులు. ఇద్దరూ కలిసి `ఈనాడు`లో నటించారు. ఇద్దరి కాంబినేషన్‌లో `మర్మయోగి` అనే సినిమా కూడా రావాల్సింది. కానీ.. చివరి నిమిషంలో ఆగిపోయింది. అయినా సరే.. ఇద్దరి మధ్యా సఖ్యత కొనసాగుతూనే ఉంది. కమల్ హాసన్ హైదరాబాద్ ఎప్పుడొచ్చినా సరే, వెంకీతో ములాఖత్ అవుతూనే ఉంటారు. వెంకీ కూడా అంతే. చెన్నై వెళ్తే, కమల్ ని కలిసొస్తారు. అయితే ఈ స్నేహం ఇప్పుడు మొదలైంది కాదు. ఇరవై ఏళ్ల క్రితమే ఊపిరి పోసుకొంది. ఈవిషయాన్ని `విక్రమ్` ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో కమల్ హాసనే స్వయంగా చెప్పారు.
''ఓసారి.. వెంకీ గోవాలో నన్ను వెదుక్కొంటూ వచ్చారు. 'ఏంటి ఫిల్మ్ ఫెస్టివల్ కి వచ్చారా' అని అడిగాను. 'కాదు.. మీ కోసమే వచ్చా' అన్నారు. ''నేను సినిమాలు చేస్తున్నా, హిట్లు వస్తున్నాయి. కానీ సంతృప్తి ఉండడం లేదు. ఏదో కావాలనిపిస్తోంది'' అన్నారు. అప్పుడు నాకు తోచిన సలహా ఇచ్చాను. అప్పటి నుంచీ కొత్త వెంకీ కనిపించడం మొదలెట్టారు`` అని తమ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు కమల్. ''వెంకీ గోల్డెన్ స్పూన్ తో పుట్టారు. కానీ కష్టపడడం మానలేదు. నేను గనుక.. ఇలాంటి కుటుంబంలో పుట్టి ఉంటే కచ్చితంగా పాడైపోయి ఉండేవాడ్ని. ఈ విషయంలో వెంకటేష్ అందరికీ ఆదర్శం'' అని కొనియాడారు కమల్ హాసన్.