సినీ పరిశ్రమ ఇప్పటికే నష్టాల్లో ఉంది. ఇలాంటి తరుణంలో కొత్తగా జీఎస్‌టీ పేరుతో ప్రభుత్వం, సినీ పరిశ్రమని మరింత నష్టాల్లోకి నెట్టే ప్రయత్నాలు చేస్తోంది. సినీ పరిశ్రమ తరఫున విశ్వనటుడు కమల్‌హాసన్ గొంతు విప్పారు. ఇది ఆయన ఒక్కరి సమస్య కాదు. యావత్ సినీ పరిశ్రమ కనీస బాధ్యత. వినోదపు పన్ను రూపంలో సినీ రంగం, ప్రభుత్వాలకు పెద్దయెత్తున పన్నుల్ని సమకూర్చుతోంది. అయినా సినీ పరిశ్రమ పట్ల ప్రభుత్వాలకి చిన్న చూపు తప్పట్లేదు. జిఎస్‌టి రాకతో 28 శాతం పన్ను భారం పడబోతోంది సినీ రంగంపై. ఈ పన్ను తగ్గింపు కోసం కమల్ పోరాటం షురూ చేస్తానంటున్నాడు. కమల్‌తోపాటు సినీ ప్రముఖులంతా పోరుబాట పట్టవలసి ఉంది. పోరాటంలో ఓడిపోయే ప్రసక్తే లేదని చెబుతున్న కమల్ మాటకి సినీ పరిశ్రమ అంతా వెన్నుదన్కు కావాలి. ఒకే మాటపై సినీ పరిశ్రమ ఈ పోరుకు సిద్ధపడాలి. పన్ను రేటు తగ్గించకపోతే, శాశ్వతంగా సినిమాల నుంచి తప్పుకుంటానని అల్టిమేటం ఇచ్చాడు కమల్ హాసన్. మొత్తంగా ఇండియన్ సినీ పరిశ్రమ ఒక్క తాటిపైకి రావాల్సిన సందర్భమిది. కేంద్ర ప్రభుత్వం ఒక్క సినీ పరిశ్రమ పైనే కాదు. నగలు, ఆభరణాలపై కూడా ఈ జిఎస్‌టీని విధించనుంది. ఈ పన్ను విధానం జూలై 1 నుండి అమలులోకి రానుంది. ఈ విధానం అనేక శ్రేణుల్లో వస్తు, సేవల పన్ను ఉంటుంది. ఇప్పటికే పలు రంగాలకు పన్నులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.