విశ్వనటుడు కమల్‌హాసన్ రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇటీవలే ఆయన తన కొత్త రాజకీయ పార్టీ పేరు కూడా ప్రకటించేశారు. ఇకపై రాజకీయాల్లో ఆయన బిజీ అయిపోవడమే తరువాయి. అయితే రాజకీయాల సంగతిటుంచితే, కమల్‌హాసన్ గతంలో నటించిన 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్ చేయనున్నారనీ ఎప్పుడో ప్రకటించారు.
అనౌన్స్‌మెంట్ అయ్యింది కనుక ఆ సినిమా కమల్ చేయాల్సి ఉంది. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే శంకర్ ఇంకా 'రోబో 2.0' మూడ్ నుండి బయటికి రాలేదు. ఆయన ఆ సినిమా మూడ్ నుండి బయటికి వచ్చేందుకే చాలా టైం పడుతుంది. ఒకవేళ వచ్చినా, శంకర్‌తో సినిమాలంటే అంత త్వరగా పూర్తి కావు. 'రోబో 2.0' తీసుకుంటే, చాలా కాలంగా షూటింగ్ జరుగుతూనే ఉండగా, గ్రాఫిక్స్ వర్క్స్ అంటూ విడుదల ఇంకా ఇంకా ఆలస్యం అవుతూనే ఉంది. అయితే కమల్‌హాసన్ మాత్రం శంకర్‌తో సినిమా వీలైనంత స్పీడుగా కంప్లీట్ అయిపోవాలని సూచిస్తున్నారట. కానీ అది జరిగే పని కాదు.
మరో పక్క రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కమల్‌కి తిరిగి సినిమాలో నటించేంత టైం దొరకడం కూడా అనుమానమే. రాజకీయాల మూడ్ నుండి కమల్‌హాసన్ రావడం, 'రోబో 2.0' మూడ్ నుండి శంకర్ రావడం ఇవన్నీ జరిగేదెప్పుడో..? మరోపక్క కమల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూనే ఇకపై తాను సినిమాలు చేయనని ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే.
మరి ఈ తరుణంలో ఇంతకీ కమల్‌హాసన్ 'భారతీయుడు 2' చిత్రం అసలు పట్టాలెక్కే అవకాశాలున్నాయో లేదో తెలియని పరిస్థితి. ఇదిలా ఉంటే, కమల్‌హాసన్ నటించిన 'విశ్వరూపం 2' మాత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.