'క‌న‌బ‌డుట‌లేదు' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : సునీల్, సుక్రాంత్‌ వీరెల్ల, వైశాలిరాజ్, హిమ‌జ‌ తదితరులు
దర్శకత్వం : బాల‌రాజు ఎం
నిర్మాత‌లు : ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్
సంగీతం : మ‌ధు పొన్నాస్‌
సినిమాటోగ్రఫర్ : సందీప్ బద్దుల 
ఎడిటర్: రవితేజ కుర్మాన‌


రేటింగ్: 2/5


థియేట‌ర్లు మ‌ళ్లీ తెర‌చుకోవ‌డంతో కొత్త సినిమాల‌కు రెక్క‌లొచ్చిన‌ట్టైంది. మ‌రీ ముఖ్యంగా ఓటీటీకీ థియేట‌ర్ల‌కూ మ‌ధ్య న‌లిగిపోతున్న సినిమాలు ఇప్పుడు స్వేచ్ఛ‌గా థియేట‌ర్ల‌లో విహ‌రించ‌డానికి రెడీ అవుతున్నాయి. అందుకే గ‌త రెండు మూడు వారాలుగా టాలీవుడ్ లో కొత్త సినిమాల హ‌డావుడి క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చిన మ‌రో సినిమా `క‌న‌బ‌డుట‌లేదు`. సునీల్ డిటెక్టీవ్ గా న‌టించిన సినిమా ఇది. హీరోలు డిటెక్టీవ్ అవ‌తారం ఎత్తిన ప్ర‌తీసారీ.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి రిజ‌ల్టే వ‌చ్చింది. పైగా ఈ త‌ర‌హా సినిమాల‌కు ఇప్పుడు ఆద‌ర‌ణ ఎక్కువ‌. మ‌రి.. `క‌న‌బ‌డుట‌లేదు` కూడా అదే సెంటిమెంట్ తో హిట్ట‌య్యిందా?  లేదా?  ఈ సినిమాలో క‌నిపించిన బ‌ల‌మైన అంశాలేంటి?  లోపాలేంటి?


* క‌థ‌


శ‌శిధ (వైశాలిరాజ్‌)కి ఆదిత్య (యుగ్ రామ్)తో పెళ్ల‌వుతుంది. అయితే... శ‌శి ఇది వ‌ర‌కు సూర్య (సుక్రాంత్‌)ని ప్రేమిస్తుంది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌నుకుంటారు. కానీ చివ‌రి క్ష‌ణాల్లో సూర్య హ్యాండిస్తాడు. దాంతో శ‌శిధ ఆదిత్య‌ని పెళ్లి చేసుకోవాల్సివ‌స్తుంది. అయితే సూర్య‌ని శ‌శి మ‌ర్చిపోలేక‌పోతుంది. త‌న‌ని మోసం చేశాడంటూ.. త‌న‌పై ప‌గ పెంచుకుంటుంది. ఆఖ‌రికి సూర్య‌ని చంపాల‌నుకుంటుంది. అందుకే శ‌శి, ఆదిత్య‌.. సూర్య‌ని వెదుక్కుంటూ వైజాగ్ వ‌స్తారు. అయితే.. ఇక్కడ వాళ్ల‌కు సూర్య క‌నిపించ‌డు. హైద‌రాబాద్ లో పోలీసుల‌కు ఓ అనాథ శ‌వం దొరుకుతుంది. ఆ శ‌వం సూర్య‌దేనా?  కాదా?  అస‌లు సూర్య వెనుక క‌థేమిటి?  ఈ కేసుని ప్రైవేటు డికెక్టీవ్ రామ‌కృష్ణ (సునీల్) ఎలా ప‌రిష్క‌రించాడు?  అనేదే క‌థ‌.


* విశ్లేష‌ణ‌


డంప్ యార్ట్ లో ఓ అనాథ శ‌వం దొర‌క‌డంతో క‌థ మొద‌ల‌వుతుంది. ఆ ఇన్వెస్టిగేష‌న్ ఓ వైపు.. శిశి - సూర్య‌ల  ఫ్లాష్ బ్యాక్ మ‌రోవైపు.. అలా రెండింటినీ బ్యాలెన్స్ చేద్దామ‌నుకున్నాడు ద‌ర్శ‌కుడు. ఆ తూకం స‌రిగా కుద‌ర‌లేదు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ, మిస్సింగ్ కేసుకి.. ఈ ల‌వ్ స్టోరీ అడ్డు ప‌డుతూ ఉంటుంది. అన్నింటికంటే అతిముఖ్య‌మైన మైన‌స్‌.. సునీల్ పాత్ర‌ని ద్వితీయార్థం వ‌ర‌కూ చూపించ‌క‌పోవ‌డం. సునీల్ నే ఈ సినిమాలో హీరో.. అని థియేట‌ర్ కి వ‌చ్చిన ప్రేక్ష‌కుడికి సునీల్ ని సెకండాఫ్ వ‌ర‌కూ చూపించ‌క‌పోవ‌డం నిరాశ క‌లిగిస్తుంది. నిజానికి క‌థ‌కి ఎప్పుడు అవ‌స‌ర‌మో అప్పుడే సునీల్ ఎంట్రీ ఇచ్చాడు. కాక‌పోతే.. అప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాని భ‌రించే ఓపిక ప్రేక్ష‌కుడికి లేక‌పోవొచ్చు. సునీల్ రాక‌తో ఈ సినిమాకి కాస్త ఊపొస్తుంది. అలాంట‌ప్పుడు సునీల్ పాత్ర‌ని ముందే ప‌రిచ‌యం చేసి, త‌న ఇన్వెస్టిగేష‌న్ లో భాగంగానే మొత్తం క‌థ‌ని చెప్పుకుంటూ వెళ్తే బాగుండేది.


క‌థంతా ద్వితీయార్థంలోనే ఉంది. సునీల్ ఇన్వెస్టిగేష‌న్ ఈ సినిమాకి ప్రాణం. ఆ ఆన్వెస్టిగేష‌న్ మ‌రీ థ్రిల్ క‌లిగించేలా లేదు గానీ, తొలి స‌గంతో పోలిస్తే.. ద్వితీయార్థ‌మే బెట‌ర్ అనిపిస్తుంది. హీరోహీరోయిన్ల ఫ్లాష్ బ్యాక్ ల‌వ్ స్టోరీని కాస్త ఫన్నీగా రాసుకుని, ఎమోష‌న్ ని పండిస్తే బాగుండేది. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించ‌న‌దిదే అయినా.. అదేమంత కిక్ ఇవ్వ‌దు. పైగా లాజిక్ లెస్ గా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే లో చాలా లోపాలున్నాయి. యాక్ష‌న్ ఎపిసోడ్స్ పేల‌వంగా ఉన్నాయి. సీఐ విక్ట‌రీ రాజు చ‌నిపోయినా.. దానిపై ఎలాంటి ఇన్వెస్టిగేష‌న్ జ‌ర‌గ‌దు. చివ‌ర్లో దోషి ఎవ‌రో చెప్పినా... త‌నని ఎలా ప‌ట్టుకున్నారో చెప్పే పాయింట్ స‌రిగా అత‌క‌లేదు. ఇలా ఈ సినిమాలో చాలా లోపాలే క‌నిపిస్తాయి.


* న‌టీన‌టులు


సునీల్ డిటెక్టీవ్ రామ‌కృష్ణ‌గా న‌టించాడు. నిజానికి త‌న‌ది చాలా లౌడ్ యాక్టింగ్. ఈ సినిమాలో మాత్రం.. ఆ ఛాయ‌లేం క‌నిపించ‌కుండా.. చాలా సెటిల్డ్ గా చేశాడు. దేనికీ ఓవ‌ర్ గా రియాక్ట్ అవ్వ‌డు. ఈ క్యారెక్ట‌రైజేష‌న్ తో ఈ పాత్ర కాస్త కొత్త‌గా క‌నిపించింది. యుగ్ రామ్, సుక్రాంత్ ఇద్ద‌రూ కొత్త వాళ్లే. న‌ట‌న వ‌ర‌కూ ఓకే గానీ, వాళ్ల‌వి హీరో ఫేసులు మాత్రం కావు. వైశాలి కూడా సోసోగానే ఉంది.


* సాంకేతిక వ‌ర్గం


క‌థ‌లో మ‌లుపులు ఉన్నాయి. అయితే అవి ద‌ర్శ‌కుడి క‌న్విన‌యెన్స్ కొద్దీ రాసుకున్న‌ట్టు అనిపిస్తుంది. సినిమా 115 నిమిషాలే. అయినా చాలా బోరింగ్ గా సాగిన ఫీలింగ్ క‌లుగుతుంది. తొలి స‌గం భ‌రించ‌డం క‌ష్టం. ద్వితీయార్థ‌మే సునీల్ వ‌ల్ల కాస్త‌యినా చూడ‌గ‌లం. నిర్మాణ విలువ‌లు ఏమంత గొప్ప‌గా లేవు. దానికంటే షార్ట్ ఫిల్మ్ మేకింగే బాగుంద‌న్న ఫీలింగ్ క‌లుగుతుంది.


* ప్ల‌స్ పాయింట్స్‌


టైటిల్
సునీల్‌


* మైన‌స్ పాయింట్స్


ఫ‌స్టాఫ్‌
క్వాలిటీ


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్:  థ్రిల్లింగ్.. మిస్సింగ్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS