ఏప్రిల్ మాసం.. ఎండల తీవ్రత ఎక్కువైంది. మరోవైపు హాట్ సమ్మర్‌ని కూల్ చేయడానికి సినిమాలూ క్యూ కట్టేశాయి. 'మజిలీ'తో స్టార్ట్ అయిన సమ్మర్ సినిమాల సందడి జోష్‌గానే కనిపిస్తోంది. 'మజిలీ' తర్వాత ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'చిత్రలహరి' మంచి టాక్ తెచ్చుకుని, విమర్శకుల ప్రశంసలతో పాటు, బాక్సాఫీస్‌కి మంచి వసూళ్లు రాబడుతోంది.
ఇక ఈ వారం నేచురల్ స్టార్ నాని 'జెర్సీ'తో రాబోతున్నాడు. ఆ తర్వాత 'అర్జున్ సురవరం', 'ఏబీసీడీ' తదితర సినిమాలు లైన్‌లో ఉన్నాయి. సందట్లో సడేమిమా అంటూ ఈ సినిమాలతో పాటు, హారర్ సినిమాలు కూడా తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాయి. హారర్ కామెడీని ఆడియన్స్‌కి పరిచయం చేసిన లారెన్స్ రాఘవ 'ముని' సిరీస్‌లో నాలుగోదాన్ని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. 'కాంచన 3' టైటిల్‌తో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇదే తరుణంలో మరో హారర్ మూవీ ప్రభుదేవా, తమన్నా నటించిన 'అభినేత్రి 2' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రెండూ ఆశక్తికరమైన హారర్ కామెడీ చిత్రాలే. ఆల్రెడీ గతంలో తమ సత్తా చాటినవే. ఇక ఈ సీజన్‌లో ఈ రెండు సినిమాల్లోనూ కామెడీ పాళ్లు కాస్త తగ్గించి, థ్రిల్లింగ్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. హారర్ కామెడీ జోనర్‌లో ఈ మధ్య చాలా సినిమాలొచ్చేశాయి. బోర్ కొట్టించేశాయి. అందుకే హారర్ కామెడీ పితామహుడైన లారెన్స్ ఈ సిరీస్‌కి సరికొత్త ఫ్లేవర్ యాడ్ చేశారట. కాస్త ఎక్కువగానే భయపెడతానంటున్నారు. అయితే ఓవియా, వేదిక తదితర ముద్దుగుమ్మలతో కాంచన 3'కి శృతి మించిన గ్లామర్ టచ్ ఇవ్వబోతున్నారట.
ఇకపోతే 'అభినేత్రి 2' కూడా కొంచెం ఎక్కువ భయం, కొంచెం ఎక్కువ గ్లామర్‌తోనే కట్టిపడేయనుందట. తమన్నాతో పాటు, ఈ సీక్వెల్‌లో నందితాశ్వేత మరో హీరోయిన్‌గా నటిస్తోంది. చూడాలి మరి మూడో 'కాంచన', రెండో 'అభినేత్రి'.. ఎవరు ఎక్కువ భయపెడతారో.!