వయసులో కురు వృద్ధులు. అందులోనూ మహిళలు. కానీ గన్ను చేత బట్టారంటే ఎంత దూరంలో ఉన్న శత్రువులైనా మట్టి కరవాల్సిందే. ఏంటీ కథ అనుకుంటున్నారా.? క్యూట్ భామ తాప్సీ, మరో అందాల భామ భూమీ పడ్నేకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రానికి సంబంధించిందే ఈ కథ.
'సాండ్ కీ ఆంఖ్' అనే టైటిల్‌తో రూపొందుతోన్న సినిమాలో తాప్సీ, భూమి పడ్నేకర్ బామ్మ పాత్ర లు పోషిస్తున్నారు. బామ్మలే కాదు, షార్ప్ షూటర్స్ కూడా వీరు. 'వృద్ధాప్యం శరీరానికే మనసుకు కాదు' అనే క్యాప్షన్‌తో తాజాగా ఈ సినిమా పోస్టర్‌ని విడుదల చేశారు. యూపీలో బాగ్‌పట్ జిల్లాకు చెందిన ఇద్దరు వృద్ధురాళ్ల కథే ఈ సినిమా. వృద్ధురాళ్లు అని తేలికగా తీసి పారేయడానికి లేదు. చంద్రో, ప్రకాశీ తోమర్ అని పిలవబడే ఈ ఇద్దరు బామ్మలకు యూపీలో షార్ప్ షూటర్స్‌గా మంచి పేరుంది. ముద్దుగా 'షూటర్ దాదీస్' అని పిలుచుకుంటారు వీరిద్దరినీ. వీరి పాత్రల్లోనే ముద్దుగుమ్మలు తాప్సీ పన్ను, భూమీ పడ్నేకర్ నటిస్తున్నారు. బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న ఈ తరుణంలో ఈ వృద్ధ మహిళా షూటర్స్ బయోపిక్ ఆశక్తి కలిగిస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు తాప్సీ, భూమీ పడ్నేకర్ చాలా కష్టపడ్డారట. వీరి గురించి లోతుగా తెలుసుకునేందుకు తాప్సీ, భూమి బామ్మల స్వస్థలమైన బాగ్‌పట్ జిల్లాకు వెళ్లి, కొన్ని రోజులు వారితోనే ఉండి ఆశక్తికరమైన పలు అంశాలను తెలుసుకున్నారట.
సినిమాకి నేచురాలిటీ తీసుకొచ్చేందుకు ఆ అంశాలు చాలా ఉపయోగపడ్డాయట. ఈ ఏడాది దీపావళికి 'సాండ్ కీ ఆంఖ్' ప్రేక్షకుల ముందుకు రానుంది. తుషార్ హీరా నందని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.