ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ యాదగిరి (49) కన్నుమూశారు. ఈ రోజు సాయింత్రం హైదరాబాద్‌లోని వెంగళరావునగర్‌లోని నివాసంలో మృతి చెందారు. గతకొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లె. 2001లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో గీత రచయితగా చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ‘మళ్లీ కూయవే గువ్వా’ పాట ఆయనకు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. సత్యం, ఇడియట్ చిత్రాలలో పాటలు కూడా కందికొండకు పేరు తీసుకొచ్చారు. తన జీవిత కాలంలో 1300కుపైగా పాటలు రాశారు. బతుకమ్మ నేపథ్యంలో రాసిన పాటలు పల్లెపల్లెనా, గడపగడపనా, జనాల నోటన మార్మోగాయి. ఆయన పాటలే కాదు కవిత్వం రాయటంలోనూ దిట్ట. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయడం ఆయన ప్రత్యేకత.
కొంతకాలంగా ఆయన కాన్సర్‌తో బాధ పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన దుస్థితి గమనించి, వైద్య సహాయాన్ని అందించింది. కాన్సర్ నుంచి కోలుకున్నా, ఇతర సమస్యలు చుట్టుముట్టాయి. కందికొండ మృతి తెలుగు పాటకు, ముఖ్యంగా తెలంగాణ పాటకు తీరని లోటు.