కంగనా రనౌత్.. బాలీవుడ్ లో సంచలనాలకు మారు పేరు. ఎలాంటి విషయాన్నయినా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. అదే తనపై వివాదాలు తెచ్చిపెడుతుంది. ఇటీవల సుశాంత్ సింగ్ ఆత్మహత్య విషయంలో చాలా సీరియస్ గా స్పందించింది కంగనా. బాలీవుడ్‌లోని బంధుప్రీతి కారణంగానే సుశాంత్ మరణించాడని, ఆదిత్య చోప్రా తన స్నేహితుడైన కరణ్ జోహార్‌తో కలిసి, కావాలనే సుశాంత్ కెరీర్‌ను నాశనం చేశాడని ఆరోపించింది. కంగనా స్టేట్ మెంట్లను ముంబై పోలీసుల సీరియస్ గా తీసుకున్నారు.
ఈ కేసులో కంగనాను విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం కంగనా ముంబైలో లేదు. మనాలీ వెళ్లింది. అందుకే ముంబై నుంచి ఓ పోలీసు బృందం మనాలి వెళ్తోంది. అక్కడ కంగనా స్టేట్ మెంట్ ని రికార్డు చేయబోతోంది. ఈ విచారణలో కంగనా ఎన్ని సంచలనాత్మక విషయాలు బయటపెడుతుందన్నది ఆసక్తిగా మారింది. కంగనా ఆవేశం కొద్దీ మాట్లాడిందా? లేదంటే తన దగ్గర సాక్షాధారాలు ఉన్నాయా? అనే విషయమై బాలీవుడ్ జనాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తన ఆరోపణల్ని నిరూపించుకోలేకపోతే గనుక.... అది కంగనని ఇబ్బందుల్లో పెట్టే అవకాశం వుంది.