ఈవారం విడుదలైన సినిమాల్లో `తలైవి` ఒకటి. ఇది తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయలలిత బయోపిక్. కంగనా రనౌత్ లాంటి స్టార్ హీరోయిన్ ఈ బయోపిక్ లో నటించింది. పైగా... జయలలిత చుట్టూ ఎన్నో విషయాలూ, వివాదాలు. దాంతో ఈ సినిమా టాక్ ఎలాగున్నా, వసూళ్లు అదిరిపోతాయనుకున్నారంతా. నిజానికి.. ఈ సినిమాకి మంచి రివ్యూలే వచ్చాయి. బయోపిక్ తీసిన విధానం బాగుందంటూ మెచ్చుకున్నారు. కానీ తీరా చూస్తే... వసూళ్ల విషయంలో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్.
శుక్ర, శని, ఆదివారాలు ఏ సినిమాకైనా చాలా కీలకం. ప్రారంభ వసూళ్లు బాగుండాల్సిందే. అయితే తలైవి ఓపెనింగ్స్ రాబట్టుకోవడంలో దారుణంగా విఫలమైంది. తొలి రెండు రోజుల్లో కనీసం 30 లక్షలు కూడా సంపాదించలేకపోయింది. దీన్ని బట్టి... తలైవి పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. జయలలిత తమిళనాడులో ఫేమస్ కదా, అక్కడైనా వసూళ్లు బాగుంటాయనుకుంటే, అక్కడా అదే పరిస్థితి. ఈ బయోపిక్ ని తమిళ ప్రజలే పెద్దగా పట్టించుకోలేదు. అక్కడా వసూళ్లు అంతంత మాత్రమే. 50 కోట్లతో తీసిన సినిమా ఇది. ఓటీటీ, శాటిలైట్ రూపంలో కాస్త బాగానే డబ్బులొచ్చాయి. థియేటరికల్ రిలీజ్ కూడా ప్లస్ అవుతుందనుకున్నారు. కానీ.. అదే ఈసినిమాని బాగా ముంచేసింది.