బయోపిక్‌ల పరంపరలో మరో జీవిత గాథ సినిమాగా వస్తోంది. ఈసారి `జయలలిత` వంతు. కంగనారనౌత్ నటిస్తున్న తలైవి... జయలలిత బయోపిక్కే. విజయ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో నందమూరి తారక రామారావు పాత్ర కూడా కీలకమే. ఆ రోజుల్లో ఎన్టీఆర్ - జయలలిత కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉంది. ఈ స్క్రిప్టులోనూ ఎన్టీఆర్ పాత్రకు కీలకమైన స్థానం ఉంది. ఆ పాత్రని జూ.ఎన్టీఆర్‌తో చేయిద్దామనుకున్నారు. ఈ విషయమై ఎన్టీఆర్‌ని సంప్రదిస్తే తన నుంచి సానుకూల స్పందన ఏదీ రాలేదు. ఆ తరవాత బాలకృష్ణ దగ్గరకు వెళ్లింది ఈ స్క్రిప్టు. ముందు బాలయ్య ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినా, ఆ తరవాత వెనకడుగు వేసినట్టు సమాచారం.
ఎన్టీఆర్ బయోపిక్ పరాజయం పాలవ్వడం వల్ల, మళ్లీ ఎన్టీఆర్‌గా నటించడానికి బాలయ్య ససేమీరా అంటున్నాడట. దాంతో చిత్రబృందం అయోమయంలో పడింది. ఎన్టీఆర్ లేకుండానే ఈ కథ చెప్పేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉందట. అందుకే ఎన్టీఆర్‌కి సంబంధించిన సన్నివేశాల్ని స్క్రిప్టు నుంచి తొలగించినట్టు సమాచారం. ఈ సినిమాని తెలుగులోనూ మార్కెట్ చేసుకోవాంటే ఎన్టీఆర్ పాత్ర ఉండాల్సిందే. అది లేకుండా సినిమా పూర్తి చేస్తే.. తెలుగులో ఈ సినిమా అమ్ముడుపోవడం కష్టమే.