ఈమధ్య ఓటీటీలు చెప్పిన మాటే.. నిర్మాతలు వినాల్సి వస్తోంది. థియేటర్లో విడుదలైన నెల రోజుల తరవాతే.. ఓటీటీలో సినిమాని ప్రదర్శించాలి అనే నిబంధన ఉన్నప్పటికీ... ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే.. మూడు వారాల లోపే.. ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. కొన్నిసార్లు థియేటర్లో సినిమా ఉన్నప్పటికీ.. ఓటీటీలో ప్రత్యక్షం అయిపోతోంది. ఓటీటీల రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో బడా నిర్మాతలు సైతం.. ఓటీటీలకు తలొగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ... `కాంతార` రూటే వేరు. కలక్షన్ల విషయంలో... బడా బడా సినిమాల కొమ్ములు విరిచిన `కాంతార`.. ఇప్పుడు ఓటీటీనీ లొంగ దీసుకొంది.
రిషబ్‌శెట్టి కథానాయకుడిగా, దర్శకుడిగా రూపొందించిన `కాంతార` బాక్సాఫీసు దగ్గర ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడొస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈనెల 18నే కాంతార ఓటీటీలో రావాలి. ఈ సినిమాని కొన్న అమేజాన్ ప్రైమ్ అందుకు ఏర్పాట్లు కూడా చేసింది. అయితే... ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఆడుతున్నందున, నిర్మాతల కోరిక మేరకు ఇంకొన్ని రోజులు ఆగాలని నిర్ణయించుకొంది. ఎందుకంటే.. కాంతార నిర్మాతలు ఇప్పుడు ఫామ్‌లో ఉన్నారు. వాళ్ల చేతుల్లో బడా సినిమాలు ఉంటున్నాయి. అందుకే.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొన్న అమేజాన్ కాంతార ఓటీటీ విడుదలను వాయిదా వేసింది. డిసెంబరు మొదటి వారంలో కాంతారని ఓటీటీలో చూసే అవకాశం ఉంది.