RRRతో మరో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నాడు రాజమౌళి. ఇప్పుడు మహేష్ బాబు కోసం కథ తయారు చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే.. తన మదిలో.. RRR - 2 ఆలోచనలు మెదులుతున్నాయి. RRR కి సీక్వెల్ చేసే ఆలోచన ఈమధ్యే రాజమౌళికి వచ్చింది. అందుకు సంబంధించిన వర్క్ కూడా ఓ వైపు జరుగుతున్నట్టు సమాచారం. నిజానికి సీక్వెల్స్‌పై రాజమౌళికి పెద్దగా ఆసక్తి ఉండదు. ఈగ 2 చేద్దామనుకొని.. పక్కన పెట్టేశాడు. `విక్రమార్కుడు 2` కథ.. విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసినా, ఆ సినిమాని తెరకెక్కించడానికి రాజమౌళి ఆసక్తిగా లేడు. కానీ... RRR 2 పై మాత్రం తనకు మక్కువ ఏర్పడింది.
ఇటీవల విదేశాల్లో ఈ సినిమాని రాజమౌళి భారీగా ప్రమోట్ చేస్తూ వచ్చాడు. చికాగో ప్రీమియర్స్‌లో... ఆర్.ఆర్.ఆర్ కి సీక్వెల్ చేస్తానంటూ మనసులోని మాట బయటపెట్టేశాడు. సీక్వెల్స్ గురించి ఎప్పుడూ మాట్లాడని రాజమౌళి.. ఇలా ఆర్.ఆర్.ఆర్ 2 గురించి ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగించేదే. కాకపోతే... ఆర్.ఆర్.ఆర్ 2 పట్టాలెక్కాలంటే కనీసం మూడు నాలుగేళ్లు పడుతుంది. ఈలోగా జక్కన్నకు ఇంకెన్ని కొత్త కొత్త ఐడియాలు వస్తాయో...? ప్రస్తుతానికైతే... ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్‌కి తలుపులు తెరచుకొన్నట్టే.